కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. యానాదిపల్లిలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఒకప్పుడు కుప్పంలో కనీస సౌకర్యాలు ఉండేవి కావని అన్నారు చంద్రబాబు. టీడీపీ హయాంలో కుప్పంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కుప్పంలో విద్య, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని చెప్పారు చంద్రబాబు. ఉత్తర కొరియాలో కిమ్ ఉన్నట్టు ఇక్కడ మనకు జగన్ ఉన్నారని విమర్శించారు.
టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. తనను కుప్పం రానివ్వకుండా చేసేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. పోలీసులు సైతం నిన్న కుప్పంలో రౌడీల్లా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనిఫాం లేకుండా వచ్చి దాడులు చేస్తున్నారని వివరించారు చంద్రబాబు. మొన్నటివరకు కుప్పంలో చిన్న గొడవ చేసేందుకు భయపడేవాళ్లు, ఇప్పుడు వేరే ప్రాంతాల నుంచి రౌడీలను తీసుకువచ్చి కుప్పంలో గొడవలు చేయిస్తున్నారు అంటూ మండిపడ్డారు చంద్రబాబు.