తిరుపతి జిల్లా నాయుడుపేట లో మేమంతా సిద్ధం సభలో జగన్ ప్రసంగించారు .వృద్ధులకు ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఎండల్లో అవస్థలు పడి 2 రోజుల్లో 31 మంది వృద్ధులు ప్రాణాలు విడిచారన్నారు వైఎస్ జగన్. ఇంత మందిని చంపిన చంద్రబాబు నాయుడును హంతకుడు అందామా? ఇంతకంటే దారుణమైన పదంతో పిలుద్దామా? అని ప్రశ్నించారు. తాను అధికారంలోకి రాగానే మళ్లీ వాలంటీర్ వ్యవస్థపై తొలి సంతకం చేస్తానన్నారు.
వచ్చే ఎన్నికలు పేదలు, పెత్తందారుల మధ్య యుద్ధమని ముఖ్యమంత్రి జగన్ పునరుద్ఘాటించారు. ‘త్వరలో కురుక్షేత్ర సంగ్రామం జరగనుంది. ఈ ఎన్నికలు పేదల భవిష్యత్తును నిర్దేశిస్తాయి అని అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కొందరు కోర్టుకెళ్లారు. అన్నింటినీ ఎదుర్కొని 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం అని తెలిపారు.మేం వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం అని పేర్కొన్నారు. SC, ST, BC, మైనార్టీలకు అన్ని రంగాల్లో 50 శాతం పదవులు ఇచ్చాం’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.