తెలంగాణలో తమ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగు వేస్తున్నారు. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపి వచ్చే ఎన్నికల వరకు పార్టీని బలోపేతంగా మార్చేందుకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఖమ్మంలో టీడీపీ శంఖారావం సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.
ముందుగా హైదరాబాద్ నుంచి చంద్రబాబు భారీ కాన్వాయ్ ద్వారా చంద్రబాబు, కాసాని జ్ఞానేశ్వర్ సభాస్థలికి చేరుకోనున్నారు. వీరితోపాటు రాష్ట్ర నాయకులంతా తరలిరానున్నారు. హైదరాబాద్‌లోని నివాసం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరనున్న చంద్రబాబు రసూల్‌పురాలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో పలుచోట్ల పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలుకనున్నాయి.
సూర్యాపేట సమీపంలో మధ్యాహ్నం భోజనం కోసం ఆగనున్న బాబు.. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఖమ్మం జిల్లా సరిహద్దుల్లోకి చేరుకుంటారు. అక్కడ తెదేపా నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలుకుతారు. కూసుమంచి మండలం కేశవపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకోనుండగా.. వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద భారీ ద్విచక్రవాహన ర్యాలీతో స్వాగతం పలుకుతారు. మయూరి సెంటర్ నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీలో పాల్గొంటారు. అక్కడి నుంచి బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. పార్టీ బలోపేతంతోపాటు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సభ ముగిసిన తర్వాత పాతర్లపాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అనంతరం చంద్రబాబు విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు.