సీఎం జగన్ కు బాబు లేఖ.. ఏమనంటే ?

-

ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ రాశారు. ఎస్ పి బాల సుబ్రమణ్యం స్మృత్యర్ధం నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం నెలకొల్పాలని లేఖలో చంద్రబాబు కోరారు. కాంస్య విగ్రహం ఏర్పాటు-కళాక్షేత్రం అభివృద్ది-ప్రతి ఏటా రాష్ట్ర పండుగగా జయంతి, జాతీయ పురస్కారం ఏర్పాటు-లలిత కళలకు ప్రోత్సాహం గురించి కూడా లేఖలో బాబు ప్రస్తావించడం జరిగింది. బాల సుబ్రమణ్యం దివ్యస్మృతికి నివాళిగా నెల్లూరులో మ్యూజికల్ యూనివర్సిటిని నెలకొల్పాలని కోరుతున్నానన్న ఆయన బాల సుబ్రమణ్యం కాంస్య విగ్రహం ఏర్పాటుతో పాటు ఆ ప్రాంతాన్ని బాల సుబ్రమణ్యం సంగీత కళాక్షేత్రంగా అభివృద్ది చేయాలనీ కోరారు.

 

 

ప్రభుత్వ సంగీత అకాడమీకి ఆయన పేరుపెట్టడం ద్వారా సంగీతం, ఇతర లలిత కళల్లో యువతరాన్ని ప్రోత్సహించడం ద్వారా బాల సుబ్రమణ్యం కల నెరవేర్చాలనీ బాబు కోరారు. ప్రాచీన తెలుగు కళా సారస్వతాన్ని గౌరవించడం ద్వారా మన సంస్కృతీ సంప్రదాయాలను సమున్నత స్థాయిలో నిలబెట్టడమే బాలసుబ్రమణ్యంకు మనం అందించే నిజమైన నివాళి అని బాబు పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రముఖ చిత్రకారుడు, సుప్రసిద్ద సినీ దర్శకుడు బాపు, ప్రముఖ రచయిత రమణల స్మృత్యర్ధం రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి కళాక్షేత్రం ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో తీర్మానించామన్న ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వశిష్ట గోదావరి ఒడ్డున బాపు కళాక్షేత్రం అభివృద్దికి శ్రీకారం చుట్టామని అన్నారు. విజయవాడలో మ్యూజియంకు బాపు మ్యూజియంగా పేరు పెట్టి గౌరవించామని అన్నారు. అదే స్ఫూర్తితో నెల్లూరులో శ్రీ ఎస్ పి బాలసుబ్రమణ్యం సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, కళాక్షేత్రం అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన 7 సాంస్కృతిక అకాడమీలలో సంగీత అకాడమీకి ఎస్ పి బాల సుబ్రమణ్యం పేరు పెట్టాలని కోరుతున్నామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news