వసంత బెదిరింపులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

-

మంత్రిని హత్య చేస్తామనే రీతిలో బెదిరింపులున్నాయి

అమరావతి: మంత్రి దేవినేని ఉమను హత్య చేస్తామనే రీతిలో బెదిరింపులకు దిగిన మాజీ మంత్రి, వైకాపా నేత వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శికి ఫోన్‌ చేసిన వసంత నాగేశ్వరావు బెదిరింపులకు పాల్పడ్డారు. అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన సీఎం.. బెదిరింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. బెదిరింపులు, హత్యలతో ఎవరూ ఏమీ సాధించలేరని.. ఇలాంటి చర్యలను ఎంతటివారు ప్రోత్సహించినా తీవ్రస్థాయిలో చర్యలుంటాయని హెచ్చరించారు. మంత్రిని హత్య చేస్తాం అనే ధోరణిలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని వ్యూహ కమిటీ సమావేశంలో సీఎం తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో వసంత నాగేశ్వరరావుపై ఇప్పటికే కేసు నమోదైందని అని నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ లోను ఈ విషయం ప్రస్తావన కు తీసుకురావాలని నిర్ణయించారు.

గ్రామంలో ఫ్లెక్సీల తొలగింపు విషయంలో ఈ నెల 7న సాయంత్రం విధుల్లో ఉన్న తనకు వసంత నాగేశ్వరరావు ఫోన్‌ చేసి తెలుగుదేశం ఏజెంటుగా పనిచేస్తున్నావంటూ బెదిరించారని గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీ మంత్రిని (దేవినేని ఉమాను) ఏమైనా చేస్తామని, అవసరమైతే కడప నుంచి మనుషులను తెప్పిస్తామని మాట్లాడారని కార్యదర్శి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటూ ఆరా తీశారని.. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని వివరించారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఆడియో టేప్‌ను విన్నారు.

‘నేనైతే ఒక పద్ధతి కలిగిన వ్యవహారంగా చేస్తా. కానీ కృష్ణప్రసాద్‌ (వసంత నాగేశ్వరరావు కుమారుడు) అలా కాదు. మొండిగా వ్యవహరిస్తాడు. తాడోపేడో తేల్చుకోవాలనే లెక్కల్లో ఉన్నాడు. డబ్బుకు, మర్డర్లకు తెగించే ఉన్నాడు. ఉమా దాడి చేయలేడనే భావన వాళ్ల మనుషుల్లో ఉంది. ఒక్క కృష్ణప్రసాద్‌కే కాదు.. జగన్‌కు కూడా వీడిపై(దేవినేని ఉమా) కక్ష ఉంది. అతడు అసెంబ్లీలో అసహ్యంగా మాట్లాడుతున్నాడు అని. వీడిని శాసనసభలో చూడడానికి వీల్లేదని జగన్‌కూ ఉంది. గుంటూరు-2 టికెట్‌ ఇస్తానని సీఎం ప్రత్తిపాడు వాళ్లను పంపాడు. నేను ఓడించాలన్న (దేవినేని ఉమాను) లక్ష్యంతో వచ్చా. తాడోపేడో తేల్చుకోవాలి’ అని వసంత ఫోన్‌ సంభాషణలో పేర్కొన్నారు. న్యాయసలహా కోసం పోలీసులు ఆడియో టేపును ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారని, పరుష పదజాలంతో బెదిరించారన్న అంశంపై వసంత నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు సీఐ పవన్‌కిషోర్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news