రాజకీయ దురంధరుడు.. ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ పితామహుడు, మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు స్కెచ్ గీస్తే.. ఎలా ఉంటుంది? అదిరిపోద్ది!! క్షణం ఆలోచించుకోకుండా చెప్పే మాట. సందర్భం ఏదైనా.. ఆయన స్కెచ్ గీస్తే.. అది అలానే సాగి పోతుంది. గత ఏడాది ఎన్నికల్లో ఎందుకో బెడిసి కొట్టింది కానీ.. సర్వసాధారణంగా ఆయన స్కెచ్ గీయడం అది జరగకపోవడం అనేది ఉండనే ఉండదు. తాజాగా ఇంత కరోనా ఎఫెక్ట్ సమయంలోనూ ఆయన వేసిన స్కెచ్ వేసినట్టు అమలు జరిగిందని అంటున్నారు పరిశీలకులు. దాదాపు రెండు నెలలకు పైగానే కరోనా ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌లో చిక్కుకుపోయారు చంద్రబాబు.
ఆయనకు రావాలని ఉన్నప్పటికీ.. రాలేక పోయారు. ఇంతలోనే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గానే స్పందించి.. బాధితులకు కనీవినీ ఎరుగని రీతిలో నష్టపరిహారం.. సహా.. అన్ని విధాలా ఆదుకుంది. అయినా కూడా ప్రధాన ప్రతిపక్షం కాబట్టి.. చంద్రబాబు కూడా అక్కడికి వెళ్లి.. బాధితులను పరామర్శించి.. జగన్‌ను ఓ నాలుగు తిట్లు తిట్టాలని అనుకున్నారు. అదేసమయంలో ప్రభుత్వంపై ఇంకొంచెం.. దుమ్మెత్తి పోయాలని అనుకున్నారు. అనుకోవడంలో తప్పులేదు. అయితే, ఆచరణలోకి వచ్చే సరికి మాత్రం వ్యూహాత్మకంగా ఎస్కేప్ అయిపోయారు. ఆయన విశాఖకు వెళ్లి.. బాధితులను పరామర్శించి.. తిరిగివిజయవాడ చేరుకుని మహానాడు నిర్వహించాలనేది ముందు వేసుకున్న ప్రణాళిక.
అయితే, బాబు బుక్ చేసుకున్న సమయానికి ఉన్న విమాన సౌకర్యం.. ఆయన బయల్దేరే సమయానికి రద్దయ్యాయి. దీనికి కూడా టీడీపీ నేతలు జగనే కారణమంటూ.. విమర్శలు గుప్పించారనుకోండి అది వేరే సంగతి! ఇక, విమానం లేక పోయినా.. ఏపీ డీజీపీ ఇచ్చిన అనుమతి రద్దయితే.. మళ్లీ ఇస్తారో లేదో అనుకున్న చంద్రబాబు నేరుగా హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు వచ్చారు. రెండు రోజులు మహానాడు నిర్వహించారు. మరి తర్వాత అదే రోడ్డు మార్గంలో విశాఖ వెళ్లి.. ఎల్జీ బాధితులను పరామర్శిస్తే పోయేది కదా?! కానీ, అలా చేయకుండా.. మహానాడు ముగించుకుని కనీసం సమాచారం కూడా చెప్పకుండానే హైదరాబాద్ వెళ్లిపోయారు.
మరి ఈమధ్యలో ఏం జరిగింది? ఎందుకు ఆయన విశాఖ కు వెల్లకుండానే ఎస్కేప్ అయ్యారు. అక్కడ బాధితులకు ప్రభుత్వం ఇప్పటికే కోట్లరూపాయల్లో పరిహారం అందించినందున తాను చేసేది ఏముందని అనుకున్నారా? లేక తాను అక్కడకు వెళ్లినా.. మరోసారి అవమానం తప్ప ఇంకేమీ జరగదని జంకారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చూస్తే.. చంద్రబాబు అవకాశం ఉండీ ఎస్కేప్.. అయ్యారని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. మరి దీనికి బాబు ఆయన పరివారం ఏమంటారో చూడాలి.