సాఫ్ట్‌వేరు.. ఐటీ.. అంటూ.. మౌసు, ల్యాప్‌టాప్ వంటి పట్టుకుని తిరుగుతూ.. మాట్లాడేందుకు ఎప్పుడు అవకాశం చిక్కినా.. సాంకేతిక యుగంలో చక్కర్లు కొట్టే టీడీపీ అధినేత చంద్రబాబుకు అనూహ్యంగా కుమ్మరి చక్రం, కమ్మరి కొలిమి.. అంటూ మహాకవి శ్రీశ్రీ కార్మిక వాదం గుర్తుకొచ్చింది. మేడేను పురస్కరించుకుని ఎన్నడూ లేని రీతిలో చంద్రబాబు శ్రీశ్రీని గుర్తు చేసుకున్నారు. మంచిదే.. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ కార్మిక లోకంలో ఎలాంటి జోష్ రేపిందో తెలియదు కానీ, రాజకీయంగా మాత్రం బాబు చేసిన ట్వీట్ ఆలోచన రేకెత్తించింది.
“ప్రభువెక్కిన పల్లకి కాదోయ్.. అది మోసిన బోయీలెవ్వరు!?“- అంటూ మహాప్రస్థానంలో శ్రీశ్రీ అడిగిన ప్రశ్నను కోట్ చేస్తూ.. తాము తమ పాలనలో ఇలానే ఉన్నామని, టీడీపీ లైన్ కూడా ఇదేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నిజానికి చెప్పుకోనేందుకు చాలానే ఉన్నా.. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నాక తీరిగ్గా ఆలోచించి తాము ఏ తప్పు చేయలేదని అన్నా.. నిజానికి శ్రీశ్రీ అన్న ఈ ఒక్క మాట చాలు.. చంద్రబాబు ఏం చేశారో.. ఎందుకు పార్టీ ఓటమి పాలైందో చెప్పడానికి అంటున్నారు పరిశీలకులు. గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది.
అయితే, దీనికి కారణం.. నిజానికి ఇప్పుడు ప్రభువెక్కిన పల్లకిని మోసిన బోయీలను పట్టించుకోక పోవడ మేనని అంటున్నారు పరిశీలకులు. టీడీపీలో ఆది నుంచి ఉన్న వారిని కాదని, కొత్తగా వచ్చిన వారిని భుజాలకెత్తించుకున్నారు. టికెట్లు, పదవులు కూడా వారికే పంచి పెట్టారు. అంటే.. అప్పటి వరకు ఏళ్ల తరబడి పార్టీని భుజాలపై మోసిన బోయీలను(పేర్లు చెప్పాలంటే చాంతాడంత అవుతుంది) చంద్రబాబు పక్కన పెట్టి.. పక్కపార్టీల నుంచి కూడా తెచ్చుకుని మరీ పదవులు కట్టబెట్టారు. వారేమయినా.. ఇప్పుడు కష్టకాలంలో ఆదుకుంటున్నారా? సో.. ఇప్పటికైనా బోయీలను గుర్తిస్తారా? బాబూ.. అంటున్నారు నోరు లేని సీనియర్ తమ్ముళ్లు.