జరిగిన ఘటన ఏదైనా.. దానికీ చట్టాలకు సంబంధాలు ఉన్నా.. ఆయా ఘటనలు చట్టాలకు వ్యతిరేకమే అయినా.. మన పంథా మనదే అనే ధోరణి సర్వసాధారణంగా ప్రతిపక్షాలకు ఉండే సుగుణమే! ఇప్పుడు ఇంతకు మించి ..టీడీపీ అధినేత చంద్రబాబు తన చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వినేవాడు ఉంటే.. చెప్పేవాడు చంద్రబాబు అన్న సామెతను నిజం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం లో ఈఎస్ ఐ మందుల కుంభకోణంలో 151 కోట్ల రూపాయల వరకు దోచేశారన్నది అధికారులు చెబుతున్న మాట. దీనికి సూ త్రధారి, పాత్రధారి అయిన వారిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కూడా ఉన్నారని చెబుతూ.. ఆయనను అరెస్టు చేశారు.
సహజంగానే ఈ పరిణామం.. టీడీపీలో గుబులు పుట్టించింది. ఎందుకంటే.. గతంలో ఇంతకన్నా పెద్ద పదవులు నిర్వహించిన అచ్చెన్న అన్నగారు ఎర్రన్నాయుడిపై ఎలాంటి ఆరోపణలు రాలేదు. కానీ, ఇప్పుడు అచ్చెన్నపై అవినీతి ఆరోపణలు రావడం, వెంటనే ఆయనను అరెస్టు చేయడంతో టీడీపీ పరిస్తితి దారుణంగా ఉందనే మాటలు వ్యక్తమయ్యాయి. మరీ ముఖ్యంగా చంద్రబా బు కనుసన్నల్లో తమ్ముళ్లు దారి తప్పారనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి అపవాదులను తప్పించుకునేందుకు లేదా హైజాక్ చేసేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వీటిలో ప్రధానంగా ఆయన ఎంచుకున్న మార్గం ఎదురు దాడే!
ఈ క్రమంలో తన అమ్ముల పొదిలో ఉన్న అన్ని ఆయుధాలను ఆయన ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా బాబు ప్రయోగించిన అస్త్రం.. బీసీ కార్డు! బీసీ నేతలను అణిచేస్తున్నారని బీసీ నేతలపై కక్ష సాధిస్తున్నారని బాబు గగ్గోలు పెట్టారు. అయితే, ఇది అట్టర్ ఫ్లాప్ అయింది. బీసీ వర్గాల నేత అయిన ఆర్ కృష్ణయ్య వంటి వారు కూడా దీనిని తప్పు పట్టారు. బీసీ నేత అయినంత మాత్రాన అవినీతికి పాల్పడితే.. చట్టం చూస్తూ కూర్చోదు కదా? అన్నారు. దీంతో వెంటనే `రాజకీయ కక్ష సాధింపు` అనే మరో అస్త్రాన్ని ప్రయోగించారు బాబు. ప్రతీకారేచ్ఛతో జగన్ రగిలిపోతున్నాడని అన్నారు. అయితే, ఇది కూడా నిజమే అయితే.. మిగిలిన వారిని కూడా అరెస్టులు చేయాలి కదా?
కానీ, అలా కూడా జరగలేదు. ఈ వాదన కూడా విఫలమైంది. దీంతో బాబు అచ్చెన్న అరెస్టు, ప్రభాకర్‌రెడ్డి జైలు పాలవడం వంటి ఘటనలను నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చారు. ఇది కూడా తూతూ మంత్రంగా సాగిపోయింది. ఇక, తన అనుకూల మీడియాలో ఎక్కడెక్కడి వారినో తీసుకువచ్చి.. పాతపడ్డ అంశాలను తెరమీదికి తెచ్చి ఇంటర్వ్యూలు ఇప్పించి.. జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసేలా చేశారు. ఇది కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో ఆయన ఏకంగా కాగడాల ప్రదర్శనకు పిలుపునిచ్చారు.
అయితే, ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. చంద్రబాబు ఇన్ని చేస్తున్నా.. అవినీతి విషయంలో తన వైఖరిఏంటనేది ఆయన స్పష్టం చేయడం లేదు. అవినీతి చేసిన వారిని రక్షించాలని ఆయన పిలుపునిస్తున్నారా? లేక.. తమ వారిని కాపాడాలని కోరుతున్నారా? మొత్తంగా ఉన్న అస్త్రాలన్నీ అయిపోయాయి. ఇక, మిగిలింది అసెంబ్లీనే!! ఏం చేస్తారో చూడాలి.