ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అధికార పార్టీ పై తీవ్ర విమర్శలు చేసారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. గ్రామాల్లో కేసుల పేరుతో బెదిరిస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. తాడేపేడో తేల్చుకొనేందుకు సిద్ధమని స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేసారు. మీ ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు.
ఇంత తక్కువ వ్యవధిలో బీసీలు ధ్రువపత్రాలు ఎలా తీసుకుంటారు? అని ప్రశ్నించారు. అన్ని జిల్లాల్లోనూ బీసీలకు తీరని ద్రోహం జరిగిందన్నారు. ఏం చూసి మీకు ఓటేయాలని వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అమరావతిలో భూములిచ్చిన రైతులను రోడ్డుపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. గుత్తేదారులకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దుకాణాల్లో నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నారన్నారు. డిస్టిలరీలు, ప్రభుత్వం పెత్తనం ఏమిటి? ప్రజల ఆరోగ్యంతో ఆటలా? అని నిలదీశారు.
ఈ 15 రోజులు ఎక్కడా మద్యం విక్రయించబోమని చెప్పాలన్నారు చంద్రబాబు. పులివెందుల పంచాయితీలు జరగనీయమని అన్నారు చంద్రబాబు. అయితే ఇక్కడ చంద్రబాబుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఉద్రిక్తంగా మారుస్తున్నారని అన్నారు. పంచాయితి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయే అవకాశం ఉందని అందుకే ఆయన ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయంగా బలహీనంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఓటమిని అంగీకరించలేరు అని అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.