తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఓటమి చెందాక రాష్ట్రంలో ప్రతి ఒక్క నాయకుడు అతన్ని విమర్శించడం మొదలుపెట్టారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో బాబు కి సొంత పార్టీ నేతల నుంచే మద్దతు కరువైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్డంకులు ఎదురు కావడం సహజమే.
అలాంటి సమయంలోనే పార్టీ మొత్తం ఒక్కటిగా మారి సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగాలి కానీ తెలుగుదేశం పార్టీలో ఆ యూనిటీ ఎప్పటినుంచో కరువైపోయింది. ముఖ్యంగా అమరావతి విషయంలో బాబు రాజధానిని నిర్మించే సమయంలో అక్కడి రైతుల దగ్గర్నుంచి భూములు తీసుకోవడంతో ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులంతా ప్రభుత్వ నిర్ణయం పట్ల విముఖత ప్రదర్శించారు.
ఇక ఇప్పుడు జగన్ విషయానికి వస్తే జగన్ కూడా అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్న నేపథ్యంలో కృష్ణా మరియు గుంటూరు జిల్లాల నుండి విపరీతమైన వ్యతిరేకత మొదలైంది. ఆ ప్రాంతంలోని వైసీపీ నేతలు అటు ప్రజలకు సర్ది చెప్పలేక ఇటు జగన్ కు నచ్చ చెప్పలేక విపరీతంగా సతమతమవుతున్నారు. దీనివల్ల ఆ ప్రాంతాల్లోని వైసీపీ నేతలకు వాళ్ళ మధ్య వారికే పరస్పర విభేదాలు మొదలై పోయాయి.
అప్పట్లో లాగా కాకుండా ఇప్పుడు ఉన్న ప్రజలు ఏదైనా సమస్య వస్తే నేరుగా తమ ప్రాంత నాయకులను ప్రశ్నించడం మొదలు పెట్టారు. చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు ఇదే సమస్య ఎదురుకోగా ఇప్పుడు వైసీపీ నేతలు కూడా ఆ ప్రాంతంలో తమకున్న పట్టు జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల పోతుందని భయపడుతున్నారు. జగన్ వీలైనంత త్వరలో 29 గ్రామాల్లోని ప్రజలకు సరైన పరిష్కారం చూపించకపోతే వైసీపీ పార్టీలో యూనిటీ దెబ్బతింటుంది. మొదటిసారి రాష్ట్రాన్ని పాలిస్తున్న జగన్ కు ఇది ఏమాత్రం మంచి సంకేతం కాదు.