విచిత్రంగా ఆమ్మాయిలపై జరిగిన దారుణ సంఘటనలు ఐపిఎస్ అధికారి సజ్జనార్‌నే వెంటాడుతున్నాయి. కాకపోతే, అప్పుడు వరంగల్‌లో ఆయన ఒక్కరోజులో హీరో అయిపోయాడు
డిసెంబర్ 10, 2008, వరంగల్…
కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో క్లాసులు అయిపోయాయి. బయటకు వచ్చిన ఇద్దరు అమ్మాయిలు తమ మోపెడ్ ఎక్కి ఇంటికి పయనమయ్యారు. కొద్దిదూరం సాగాక, అకస్మాత్తుగా ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై వచ్చి, వీరిని అడ్డగించారు. మధ్యలో ఉన్న యువకుడు ఒక్కసారిగా తన చేతిలో ఉన్న సీసా మూత తీసి, అందులో ఉన్న ద్రావణాన్ని అమ్మాయిలపైకి చల్లి, అంతేవేగంగా, అదే బైక్‌పై పారిపోయారు. మోపెడ్ కొంతదూరం వెళ్లి పడిపోయింది. అమ్మాయిలు హృదయవిదారకంగా కేకలు పెడుతున్నారు. అదే దార్లో వెళ్తున్న ఒక కానిస్టేబుల్ వారిని ఆసుపత్రికి తరలించాడు.
ఆ అమ్మాయిలు…. ప్రణీత, స్వప్నిక
ముగ్గురు యువకులు…. శ్రీనివాస్, హరికృష్ణ, సంజయ్.
చల్లిన ద్రావణం… యాసిడ్.
అమ్మాయిలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రణీత హెల్మెట్ పెట్టుకోవడం వల్ల బతికిపోయింది. స్వప్నిక తీవ్ర గాయలతో మరుసటిరోజు కన్నుమూసింది. పోలీసులు తీవ్ర వేదనతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని 48 గంటల్లో నిందితులను అరెస్టు చేసారు. విలేకరుల సమావేశంలో నిందితులతోనే ఎలా చేసారో మాట్లాడించారు. ఆ తెల్లవారుజామున నిందితులు వాడిన బైక్, కత్తులను దాచిన ప్రదేశం చూడ్డానికి వెళ్లిన పోలీసులపై కత్తులు, తుపాకీతో దాడికి దిగారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులు జరిపిన ‘‘ఎదురుకాల్పుల’’లో ముగ్గురు నిందితులు చనిపోయారు.
అప్పుడు వరంగల్ ఎస్పీ వి.సి.సజ్జనార్.
అంతకుముందు మనీషా అనే చిన్న పాపను దుండగులు కిడ్నాప్ చేసి, డబ్బులు డిమాండ్ చేసి, చంపేసారు. రాష్ట్రమంతా అట్టుడికింది. ఆ తర్వాత రెండు రోజులకు దొరికిన దుండగులు హత్యాప్రదేశాన్ని చూపెడుతూ, పోలీసులపై దాడికి దిగడంతో గత్యంతరం లేక ‘‘ఎన్‌కౌంటర్’’లో చంపేసారు.
అప్పుడు వరంగల్ ఎస్పీ సౌమ్యామిశ్రా.
కానీ, ఇప్పుడు జరిగింది అంతకంటే ఘోరం. మానవజాతి సమస్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన సమయం. రాష్ట్రాలకు రాష్ట్రాలు కన్నీరు పెడుతున్న వైనం. నిందితులను నడిరోడ్డుపై చంపేయాలనే నినాదాలు. అంతటా అదే కోరిక.
ఇప్పుడూ ఇక్కడ కమిషనర్ వి.సి. సజ్జనార్. మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టాడు. ఆశ్చర్యకరంగా నిందితులను కోర్టుకు అప్పగించాడు. కోర్టు వారికి 14రోజులు రిమాండ్ విధించి, జైలుకు పంపింది. అంతే… అంతా అయిపోయింది.
ఇక శిక్ష కోర్టు విధించాల్సిందే.. తక్షణ న్యాయానికి నీళ్లు వదలాల్సిందే. తొమ్మిది నెలల పసిపాపను కూడా వదలని దుర్మార్గుడికే న్యాయస్థానం యావజ్జీవం వేసి బతితే అవకాశం ఇచ్చింది. ఇప్పుడెంత మంది బతుకుతారో.. ఇంకెంతమంది ప్రియాంకలు బలి కావాలో..
ప్రజాస్వామ్యమా.. వర్థిల్లు.