తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల్లో భయాందోళన మొదలైంది. శ్రీవారి దర్శనార్థం.. తిరుమల నడక మార్గంలో వెళ్తున్న భక్తులను చిరుతల సంచారం భయభ్రాంతులకు గురి చేస్తోంది. జూన్ 11 న కౌశిక్ అనే బాలుడు చిరుత దాడిలో గాయపడి కోలుకోగా.. ఆగస్టు 11న లక్షిత అనే చిన్నారి చిరుత దాడిలో మరణించింది. ఈ ఘటన మరువవక ముందే ఈ రోజు ( ఆగస్టు 13) సాయంత్రం అలిపిరి నడక మార్గంలో మరో చిరుత కనపడింది.తిరుమలలో మరోసారి చిరుత సంచారం భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. నడక మార్గంలో 2450 వ మెట్టు వద్ద వద్ద కనిపించింది.
అప్రమత్తమైన అటవీ అధికారులు 7 వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. చిరుతను దారి మళ్లించేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.తిరుమలలో కాలి నడక మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల బాలిక మృతి చెందిన ఘటన ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. శుక్రవారం ( ఆగస్టు 11) రాత్రి కుటుంబ సభ్యులతో కాలినడకన తిరుమలకు వెళ్తున్న సమయంలో లక్షిత అదృశ్యమైంది. దీంతో గాలింపు చర్యలు మొదలు పెట్టిన అధికారులకు శనివారం ఉదయం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్ద బాలిక మృత దేహం గుర్తించారు. దీంతో, తిరుమల పరిసరాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన మరవకముందే ఇప్పుడు చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు.