ఉత్కంఠ పోరులో చెన్నై విజయం..కోల్‌కతాపై 6వికెట్ల తేడాతో గెలుపు

ఐపీఎల్-13లో మరో ఉత్కంఠ మ్యాచ్‌ చెన్నై-కోల్‌కతా మధ్య జరిగింది..ప్లేఆఫ్‌ రేసులో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో పోరాడి ఓడింది..మరో వైపు ఫ్లేఆఫ్ రేస్ నుంచి తప్పుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా రెండో విజయం సాధించింది..ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 4వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంబటి రాయుడు కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. చివరి రెండు ఓవర్లలోనే మ్యాచ్‌ చెన్నై వైపు తిరిగింది. ఫెర్గుసన్‌ వేసిన 19వ ఓవర్లో జడేజా ఫోర్‌, రెండు సిక్సర్లు బాది 20 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లోనూ చివరి రెండు బంతుల్లో రెండు భారీ సిక్సర్లు కొట్టి చెన్నైకి అద్భుత విజయాన్నందించాడు. కోల్‌కతా బౌలర్లలో స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి కీలక సమయాల్లో వికెట్లు తీసి చెన్నైని కట్టడి చేశాడు. ఇక స్పీడ్‌స్టర్‌ పాట్‌ కమిన్స్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.