ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుపతిలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవినీతికి పాల్పడ్డ అరాచకవాది ఏబీ వెంకటేశ్వరరావు విషయమై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో దేశానికే ప్రమాదకరమైన వస్తువులు కొనుగోలు చేసిన వ్యక్తి వెంకటేశ్వరరావు అని, ఆయనపై కేంద్రం సీరియస్ గా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబునాయుడు పీఏలపై కన్నా ముందు ఏబీ వెంకటేశ్వరరావుపై ఐటీ, ఈడీ దాడులు జరిగి ఉన్నట్టయితే ఆశ్చర్యపోయే వాస్తవాలు బయటకొచ్చి ఉండేవని అభిప్రాయపడ్డారు. అలాగే బెంగళూరులో వ్యవసాయం చేస్తానని చెబుతున్న వెంకటేశ్వరరావుకు అక్కడ వంద ఎకరాలు ఉన్నాయని ఆరోపించారు. ఎకరం ధర కనీసం రూ.10 కోట్లు అనుకుంటే ఆ భూముల మొత్తం విలువ వెయ్యికోట్ల రూపాయల వరకు ఉంటుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు హయాంలో విచ్చలవిడి అవినీతికి పాల్పడి ఆస్తులు సంపాదించారని, వాటిని చూసుకునే తీరిక కూడా ఆయనకు లేదని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి తనను సస్సెండ్ చేయడం అదృష్టంగా భావిస్తారే తప్ప పనిష్ మెంట్ గా భావించరని ఏబీపై విమర్శలు చేశారు.