కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది తమ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను కోల్పోయారు. అనేక కుటుంబాల్లో ఎక్కువ సంఖ్యలో బాధితులు కోవిడ్ బారిన పడి చనిపోయారు. దీంతో ఆయా కుటుంబాల్లో మిగిలి ఉన్న వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ముఖ్యంగా కోవిడ్ వల్ల కుటుంబంలో తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఇలాంటి పిల్లల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. అందువల్ల ఇలాంటి వారి కోసం ప్రభుత్వాలు ఏదైనా కార్యాచరణను ప్రకటించాలని స్వచ్ఛంద సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
దేశంలో కోవిడ్ వల్ల తల్లిదండ్రులు చనిపోతుండడంతో ఆ కుటుంబాల్లో ఉండే పిల్లలు అనాథలుగా మారుతున్నారు. దీంతో వారికి ఏం చేయాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. ఇలాంటి కష్ట సమయంలో ఆదుకునే వారు లేక పిల్లలు ఆపన్నహస్తాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తల్లిదండ్రులిద్దరూ కోవిడ్ బారిన పడి హాస్పిటళ్లలో చేరితే ఒక వేళ వారు చనిపోతే వారి పిల్లలను ఎవరు సంరక్షించాలో సంరక్షకుల పేర్లను తెలియజేసేలా హాస్పిటళ్లలో అడ్మిషన్ ఫామ్స్‌ను ఏర్పాటు చేయాలని మినిస్ట్రీ ఫర్ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సూచించింది. దీంతో కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులు చనిపోయినా వారి పిల్లలు అనాథలుగా మారకుండా ఉంటారని, ఎవరో ఒకరి సంరక్షణలో ఉంటారని తెలిపింది.
అయితే కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారుతున్న పిల్లల పట్ల ఏవైనా చర్యలు చేపట్టకపోతే వారు ఇబ్బందులు పడే అవకాశం ఉందని సామాజిక వేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా వారిని అక్రమ రవాణా కింద తరలించే అవకాశం ఉంటుందని, వ్యక్తులు వారిని దత్తత తీసుకుంటామని చెప్పి వారిని తీసుకుని ఇతర దేశాలలోని వారికి విక్రయించే అవకాశం ఉంటుందని, ఇంకా పలు ఇతర విపరీత పరిణామాలు ఏర్పడేందుకు కూడా అవకాశం ఉంటుందని అంటున్నారు. కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పిల్లలను చేరదీయడమో లేదా స్వచ్ఛంద సంస్థలకు చెందిన అనాథాశ్రమాల్లో చేర్పించడమో లేదా పిల్లలకు చెందిన బంధువులను లేదా వారి తల్లిదండ్రులకు చెందిన తెలిసిన వారికి అప్పగించి వారిని సంరక్షకులుగా ఉంచడమో చేయాలని సూచిస్తున్నారు. లేదంటే పిల్లలు ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తున్నారు.