గాలి ఏమాత్రం చొరబడని గదుల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, అలాంటి వాతావరణంలో కరోనా వైరస్ కణాలు గాలిలో ఎక్కువ సేపు ఉంటాయని గతంలోనే సైంటిస్టులు చెప్పారు. అయితే ఇదే విషయంపై కేంద్రం తాజాగా మరిన్ని రూల్స్‌ను తెలిపింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ప్రధాన సైంటిఫిక్ సలహాదారు కె.విజయరాఘవన్ కార్యాలయం ఆ రూల్స్ ను వెల్లడంచింది.
కరోనా వైరస్ సంక్రమణను అడ్డుకోవాలంటే గదుల్లో తగినంత గాలి రావాలని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకున్నా, వేయించుకోకపోయినా ప్రతి ఒక్కరూ మూడు నియమాలను గుర్తుంచుకోవాలన్నారు. మాస్క్‌లు, భౌతిక దూరం, వెంటిలేషన్ తప్పనిసరి అని అన్నారు.
ఇంట్లోకి తగినంత మొత్తంలో గాలి వచ్చేలా చూసుకుంటే కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి నుంచి ఉమ్మి, ముక్కు ద్వారా వెలువడే పెద్ద తుంపరలు వెంటనే నేలపై పడిపోతాయని, కానీ చిన్న తుంపరలు గాలిలో 10 మీటర్ల వరకు వ్యాప్తి చెందుతాయని, దీంతో కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కనుక గదుల్లోకి తగినంత గాలి వచ్చేలా చూసుకోవాలన్నారు.
కరోనా సోకిన వ్యక్తికి దగ్గర్లో ఫ్యాన్లు ఉంచకూడదని అధికారులు తెలిపారు. లేదంటే ఆ ఫ్యాన్ల నుంచి వచ్చే గాలి ఇతరులకు చేరుతుందని, దీంతో వారు కోవిడ్ బారిన పడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నారు.
గదులకు చెందిన తలుపులు, కిటికీలను మూసి వేయాల్సి వస్తే కనీసం ఎగ్జాస్ట్ ఫ్యాన్స్‌ను అన్నా నడిపించాలని అన్నారు. దీంతో గాలి సరఫరా కొనసాగుతుందని తెలిపారు.
పనిచేసే ప్రదేశాల్లో ఏసీలను ఆన్‌లో ఉంచినప్పటికీ తలుపులు, కిటికీలను తెరిచి ఉంచాలని, దీంతో తాజా గాలి ప్రసారం అవుతుందని, వైరస్ కణాలు శక్తిని కోల్పోతాయని తెలిపారు. దీని వల్ల వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు.