కరోనా వైరస్ నేపథ్యంలో చైనా, అమెరికా మధ్య కొంతకాలంగా మాటలయుద్ధం నడుస్తోంది. ఇటీవల అమెరికా గూఢచార విమానాలు వివాదాస్పద భూభాగంలో తిరుగుతున్నాయని చైనా ఆరోపించింది. ఈ క్రమంలో అమెరికాకు హెచ్చరికగా డ్రాగన్ కంట్రీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. చైనా నావికా విన్యాసాల్లో భాగంగా మొదటిసారిగా రెండు విమాన విధ్వంసక మిసైళ్లని దక్షిణ చైనా సముద్రంపైన ప్రయోగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఈ రెండు మిస్సైళ్లు 4 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలవు.
దక్షిణ, తూర్పు చైనా సముద్ర ప్రాంతాల్లో ఉన్న వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని, చైనా ఈ ప్రాంతంలో సైనిక స్థావరాలను బలోపేతం చేసుకుంటోంది. అయితే.. దక్షిణ చైనా సముద్రంపై తమకే పూర్తి అధికారాలున్నాయని చైనా అంటోంది. కానీ.. వియత్నాం, మలేషియా, పిలిప్‌పైన్స్, బ్రూనే, తైవాన్‌లు చైనాతో విభేదిస్తున్నాయి.