చైనాలోని వూహాన్ సిటీ సీ ఫుడ్ మార్కెట్‌లో ముందుగా కరోనా వైరస్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆ వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది. అయితే ఏప్రిల్ నెలలోనే చైనాలో కరోనా కేసులు పూర్తిగా తగ్గినా.. ప్రస్తుతం మళ్లీ కొత్తగా 45 మందికి కరోనా రావడం అక్కడ అందరనీ కలవరపెడుతోంది. చైనాలోని బీజింగ్‌లో ఉన్న అది పెద్ద మార్కెట్లలో ఒకటైన జిన్‌ఫడికి సంబంధం ఉన్న ఆ 45 మందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ కావడం కలకలం రేపుతోంది. దీంతో చైనాలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాగా కరోనా పాజిటివ్ వచ్చిన ఆ వ్యక్తులకు ఎవరికీ కరోనా లక్షణాలు లేవని అక్కడి అధికారులు చెప్పారు. ఇక ఆ మార్కెట్‌లో పనిచేసే మొత్తం 10వేల మందికి ప్రస్తుతం కరోనా పరీక్షలు చేస్తున్నారు. అలాగే ఇటీవలి కాలంలో ఆ మార్కెట్‌కు వచ్చిన వారి వివరాలను కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక జిన్‌ఫడి మార్కెట్‌కు సమీపంలో ఉన్న 11 గృహ సముదాయాల్లోనూ వేల మందికి కరోనా పరీక్షలు చేయనున్నారు. అయితే ఆ మార్కెట్‌లో పనిచేస్తున్న వారికి కరోనా రావడంతో ఆ మార్కెట్‌ను, దాని చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలను చైనా ప్రభుత్వం మూసివేసింది. ఆయా ప్రాంతాల్లో పూర్తిగా లాక్‌డౌన్‌ను విధించారు.
చైనా ప్రభుత్వం చెబుతున్న ప్రకారం గత 2 నెలలుగా అక్కడ కరోనా కేసులు లేవు. కానీ గత 2, 3 రోజులుగా కొత్తగా కరోనా కేసులు వస్తుండడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ ఎన్నో వేల మంది కరోనా నుంచి కోలుకోగా, ఎంతో మంది చనిపోయారు. అక్కడికి ఆ కథ ముగిసింది. కానీ ఇప్పుడక్కడ మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండడం సంచలనం కలిగిస్తోంది. దీంతో చైనాలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ మొదలైనట్లేనని పలువురు అంటున్నారు. కాగా జిన్‌ఫడి మార్కెట్ విస్తీర్ణం 112 హెక్టార్లుగా ఉంది. 1500 మంది సిబ్బంది ఆ మార్కెట్‌ను నిర్వహిస్తుంటారు. మరో 4 వేల మంది అక్కడ షాపులను కలిగి ఉన్నారు. ఈ క్రమంలో మొత్తం అందరినీ క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు చేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో అక్కడ పరిస్థితి ఎలా ఉండనుందో తేలనుంది.