చైనా కరోనా వ్యాక్సిన్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. నెల రోజుల పాటు నిర్వహించిన మూడో దశ ట్రయల్స్‌లో వ్యాక్సిన్ సురక్షితమని తేలింది. దీనిని తక్షణమే ఉపయోగించేందుకు ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోదం లభించింది. ఈ వ్యాక్సిన్‌ను జులై 22 నుంచే వినియోగించేందుకు అనుమతి లభించిందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు మొదటగా ఈ వ్యాక్సిన్‌ను ఫుడ్ మార్కెట్, ట్రాఫిక్ వ్యవస్థ, సేవారంగాలలో పనిచేసే వారికి ఇవ్వనున్నట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వైద్యశాస్త్ర, సాంకేతిక అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ ఝెంగ్ జోంగ్ వీ శనివారం ప్రకటించారు.
వ్యాక్సిన్ ధర.. గతంలో చైనా ప్రభుత్వ ఔషధ సంస్థ సినోఫార్మా ప్రకటించిన దానికంటే తక్కువగానే ఉంటుందని జోంగ్ వీ తెలిపారు. మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా వ్యాక్సిన్‌ను యూఏఈలోని 20వేల మందిపై ప్రయోగించినట్లు సినోఫార్మా ఛైర్మన్ యాంగ్ షియోమింగ్ వెల్లడించారు. ప్రభుత్వం అనుమతించడానికి ముందే ఈ సంస్థ తమ సిబ్బందిపై జులైలో వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది.చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ కూడా మరో వ్యాక్సిన్ క్యాండిడేట్‌ను తయారు చేస్తోంది. ఇండోనేసియాలో 1600 మంది వలంటీర్లపై ఈ నెలలోనే ట్రయల్స్‌ను ప్రారంభించింది.