చైనా సహా ఇతర దేశాలకు సంబంధించిన ఔషధాలు, సరఫరా చేసే సంస్థలకు అమెరికా స్వస్తి చెప్పనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించడానికి చైనాయే కారణమని మరోసారి ఆరోపించిన ట్రంప్.. ఈ మేరకు బీజింగ్ తగిన మూల్యం చెల్లిస్తుందన్నారు. చైనా.. తన అసమర్థతతో ఉద్దేశపూర్వకంగా చేసిన ఘోర తప్పిదానికి అమెరికాతో సహా ప్రపంచ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.
అనంతరం ఓహియోలోని ఓ కర్మాగారాన్ని సందర్శించిన ట్రంప్.. అక్కడి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఒబామా- బైడెన్లు అధికారంలో ఉన్నప్పుడు చైనా సులువుగా తమ కార్యకలాపాలు కొనసాగించిందన్నారు. ఇకపై అలాంటి పరిస్థితులు తలెత్తకుండా.. రాబోయే నాలుగేళ్లలో తమ దేశంలోనే ఔషధ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని చెప్పారు. ఈ విషయంలో ఇతర దేశాలపై ఏ మాత్రం ఆధారపడమని స్పష్టం చేశారు. అందులో భాగంగా చైనా వైరస్ను అరికట్టడమే తమ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు