అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనపై చైనా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఆమె పర్యటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన డ్రాగన్ ఆదివారం కూడా వాయు, సముద్ర జలాల్లో మిలటరీ విన్యాసాలను కొనసాగించినట్టు వెల్లడించింది.
ఓ వైపు ఉద్రిక్తతలు చల్లార్చే దిశగా ప్రయత్నించాలని అంతర్జాతీయ సమాజం పిలుపునిస్తున్నప్పటికీ తైవాన్ జలసంధిని టార్గెట్ చేస్తూ డ్రాగన్ యుద్ధ విమానాలు, డిస్ట్రాయర్ నౌకలతో విన్యాసాలు చేస్తుండటంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు, తైవాన్‌లో తక్షణమే సైనిక విన్యాసాలు నిలిపివేయాలంటూ అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు కోరుతోన్న నేపథ్యంలో డ్రాగన్ సేనల పరాక్రమాన్ని తెలిపే వీడియోను చైనా అధికార మీడియా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. 100కి పైగా యుద్ధ విమానాలు మోహరించడంతో పాటు చైనా కొత్త తరం ఏరియల్ రిఫ్యూయలర్ YU-20ల ఆవిష్కరణ, పదికి పైగా డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్స్‌తో సంయుక్తంగా విన్యాసాలు కొనసాగుతున్నట్టు తెలుపుతూ వీడియోను విడుదల చేసింది.