చీరాల వైసీపీలో కరణం-ఆమంచి వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎవరికి ఎవరు తగ్గడం లేదు. ప్రభుత్వ కార్యక్రమమైనా.. పార్టీ కార్యక్రమైనా… తమదే పైచేయి కావాలనే పట్టుదలకు పోతున్నారు.. తొడగొట్టి గొడవపడుతున్నారు.అయితే వీరి విషయంలో మంత్రి గారి అత్యుత్సహమే మరింత నిప్పు రాజేస్తుందట.పాత విషయాలను దృష్టిలో పెట్టుకున్న మంత్రే మంటలు రాజేస్తున్నారట.
కరణం బలరాం వైసీపీకి దగ్గర కావడాన్ని ఆమంచి ఆస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓడినా పార్టీ అధికారంలో ఉండటంతో చక్రం తిప్పాలన్నది ఆయన ఆశ. దానికి ఆయన మీద గెలిచిన బలరాం పార్టీ మారి అడ్డుపడుతున్నారు. దీంతో ఆమంచికి చిర్రెత్తుకొస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య ఇప్పటికే పలు సందర్భాలలో బాహాబాహీకి దిగాయి. ఇప్పటి వరకు ఇది ఈ రెండు వర్గాల గొడవే అనుకున్నారు. అయితే దీని వెనుక జిల్లాకు చెందిన మంత్రి బాలినేని హస్తం ఉందని ఆమంచి వర్గం అనుమానిస్తోంది. మొత్తం కథ మంత్రే నడిపిస్తున్నాడన్నది వారి ఆరోపణ.
తాజాగా కరణం బలరాం పుట్టినరోజు సందర్భంగా ఆయన వర్గీయులు ఆమంచి స్వగ్రామం పందిళ్లపల్లిలో ఓ కార్యక్రమం పెట్టారు. కార్యక్రమానికి వెళ్లిన కార్యకర్తలు ఆమంచి ఇంటి ముందు నుంచి ప్రదర్శనగా వెళ్లే సమయంలో రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో దాడులకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అసలు అక్కడ ర్యాలీ చేసే ఉద్దేశం బలరామ్‌కు లేదని ఆమంచి వాదన. మంత్రి బాలినేనే కావాలని ర్యాలీ పెట్టించి… దాన్ని తన ఇంటి ముందు నుంచి వెళ్లేలా చేశారని ఆమంచి పార్టీ పెద్దలకు చెప్పారట.
బలరామ్‌కు ఆమంచి మధ్య బాలినేని రావాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న ఇక్కడ వస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరే సమయంలో జిల్లా నేతగా ఉన్న బాలినేని ద్వారా కాకుండా నేరుగా హైకమాండ్‌తో టచ్‌లోకి వెళ్లారట ఆమంచి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా అలాగే చేశారట. అప్పటి నుంచి వీళ్లు మంత్రిని కలవడం కానీ… మంత్రి వీళ్లను కలవడం కానీ లేదట. బలరాం మాత్రం ప్రాపర్ చానెల్లో బాలినేని ద్వారా పావులు కదిపి పార్టీలో చేరిపోయారట. దీన్ని దృష్టిలో పెట్టుకునే బాలినేని ఇప్పుడు తమను టార్గెట్ చేస్తున్నారన్నది ఆమంచి అండ్ కో చెబుతున్న అనుమానిస్తున్నట్లు తెలుస్తుంది.