తెలంగాణలో వరుస చిరుత దాడులు సంచలనం రేపుతున్నాయి. నిన్నటికి నిన్న నిర్మల్ జిల్లాలో ఒక చిరుత దాడి చేసి లేగదూడను చంపేసింది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో చిరుతలు కనిపిస్తుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా టెన్షన్ పెడుతున్న చిరుతలను పట్టుకోవడానికి అటవీశాఖాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా కోయిల్ కొండ మండలం నల్లవెల్లిలో ఓ చిరుత ఇద్దరు రైతులపై దాడి చేసింది. అయితే, ఆ చిరుత దాడి నుంచి రైతులు తృటిలో తప్పించుకొని బయట పడ్డారని చెబుతున్నారు. రైతులు తప్పించుకోవడంతో ఆ చిరుత వారు తీసుకు వెళ్ళిన మేకలపై దాడి చేసింది. మొత్తం మీద చిరుత మూడు మేకలను చంపి తిన్నది. నల్లవెల్లిలో చిరుత సంచరిస్తున్నట్టు తెలుసుకున్న స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఘటనా స్థలానికి వెళ్లిన ఫారెస్ట్ అధికారులు దాని కాలి ముద్రలని ట్రేస్ చేసే పనిలో పడ్డారు.