ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు అయిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరులో తన హవాను ప్రదర్శిస్తున్నారా? జిల్లాలో తన మాటే నెగ్గాలని భావిస్తున్నారా? దీంతో స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలకు అసలు విలువే లేకుండా పోతోందా? వారి మాటలను అధికారులు పట్టించుకోవడం లేదా? ఏ ఒక్క చిన్నపని చేయాలన్నా.. పెద్దిరెడ్డి అనుమతి తీసుకోవాల్సి వస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులు. దీంతో ఇక్కడి ఎమ్మెల్యేలు మంత్రిగారిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీచిత్తూరు జిల్లాలో ఒక్క కుప్ప తప్ప మిగిలిన అన్ని నియజకవర్గాల్లోనూ విజయం సాధించింది.
దీంతో జిల్లా వ్యాప్తంగా వైసీపిని చిరస్తాయిగా నిలబెట్టేందుకు ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు. దీనిలో బాగంగా అనేక అభివృద్ధి పనులను నెత్తికెత్తుకున్నారు. వీటికి సంబంధించి నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు. వాటిని అధికారులకు, కలెక్టర్‌కు కూడా నివేదించారు. అయితే, నెలలు గడుస్తున్నా కూడా వీటికి మోక్షం లభించడం లేదు. చిన్న రోడ్డు వేసేందుకు కూడా అధికారులు ముందుకు రావడం లేదు. దీంతో విషయంపై ఎమ్మెల్యేలు ఆరా తీయగా.. పెద్దిరెడ్డి చెప్పిన పనులను మాత్రమే చేస్తామంటూ అధికారులు ముక్తాయించారు.
పోనీ .. ఆయనతో చర్చించాలని, ఆయన అనుమతి తీసుకుని పనిచేద్దామని భావించిన కేవలం తన అనుకున్న వారికి మాత్రమే మంత్రి అందుబాటులోకి వస్తున్నారు తప్ప మిగిలిన వారిని అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజల నుంచి సహజంగానే ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతోంది. జగన్ ప్రబుత్వం ఈ ఐదు మాసాల్లో అనేక పథకాలను ప్రవేశపెట్టింది.వీటికి అర్హులు ఉన్నప్పటికీ.. జిల్లాలో అధికారులు నమోదు చేయడం లేదు. దీనికి కూడా మంత్రి పెద్దరెడ్డి అనుమతులు కావాలని వారు చెబుతున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎమ్మెల్యేలు.. పీలేరు, సత్యవేడు, తంబళ్లపల్లె, పలమనేరు, పూతలపట్టు, మదనపల్లె నియోజకవర్గాలకు చెందిన చింతల రామచంద్రారెడ్డి, ఆదిమూలం, ద్వారకానాథ్‌రెడ్డి, వెంకటేష్‌గౌడ్, ఎం.ఎస్‌బాబు, నవాజ్‌బాషాలు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా అభివృద్ది సమీక్షా మండలి సమావేశం వేదికగా మంత్రిని దుయ్యబట్టారు. మీ వల్ల మాకుపనులు జరగడం లేదు. ఇలా అయితే, స్తానిక ఎన్నికల్లో పార్టీ భ్రష్టు పట్టిపోతుందంటూ.. విమర్శలు సంధించారు. అయినా కూడా పెద్దిరెడ్డి పెద్దగా పట్టించుకోకపోగా.. ఏదైనా ఉంటే తాడేపల్లికి రండి అక్కడ మాట్లాడుకుందాం.,. అంటూ దాటవేశారు. పైగా మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేల మాదిరిగా వ్యవహరిస్తే.. జగన్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించడం కొసమెరుపు. మరి ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో వైసీపీ బతికి బట్టకట్టేనా? అనే సందేహాలు వస్తున్నాయి.