రాష్ట్ర అవతరణ దినోత్సవం సంధర్బంగా సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో జండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఎందరో మహానుభావులు… అందరికి వందనాలు అంటూ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుజాతి తరఫున అందరికి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రం పద్మ అవార్డులను, భారతరత్న లాంటి అవార్డులతో సత్కరిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి అవార్డులు ఇవ్వాలని వైఎస్ఆర్ అవార్డులు ఇస్తున్నామని జగన్ వ్యాఖ్యానించారు. నిండైన తెలుగుదనం నాన్నగారి పంచెకట్టులో కనిపిస్తుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. నిండైన అభిమానం ఆయనని చూస్తేనే కనిపిస్తుందని…ఆకాశమంత ఎత్తెదిగిన ఆ మహామనిషి పేరు మీద అత్యున్నత పౌర పురస్కారాలు ఇస్తున్నామని వ్యాఖ్యానించారు.
వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులకు 10 లక్షలు, అచీవ్మెంట్ అవార్డులకు 5 లక్షలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ప్రతీ సంక్షేమ పథకం ప్రతీ పేదవాడికి అత్యంత పారదర్శకంగా ఇచ్చామని తెలిపారు. అవార్డుల ఎంపికలో కుల,మత, ప్రాంత, రాజకీయాలను చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. మనిషిని మనిషిగానే చూసామని…రాష్ట్ర చరిత్రలోనే భేదాభిప్రాయాలు లేని అత్యంత ఉన్నత అవార్డులు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
అసామాన్యుల వెలకట్టలేని ప్రతిభకు సలాం చేస్తూ అవార్డులు ఇచ్చామని అన్నారు. మన సంస్కృతిని ఇనుమడింప చేసిన ప్రతీ ఒక్క మహోన్నత వ్యక్తికి, వ్యవస్ధకి, సంస్ధలకు అవార్డులిస్తున్నామని తెలిపారు. రైతుకు, వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో విప్లవానికి ఇస్తున్న అవార్డులు ప్రతీ ఏటా నవంబరు 1న ఇస్తామని స్ఫష్టం చేశారు.