స్థానిక వైసీపీ నేత అనుచరుడి ఫిర్యాదు మేరకు వెదుళ్లపల్లిలో వరప్రసాద్ అనే దళిత యువకుడిని అరెస్టు చేసిన తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరం పోలీసులు తీవ్రంగా కొట్టి, శిరోముండనం చేశారు. ఈ దారుణ ఘటనపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు బాధ్యులైన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు విధించినట్లు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.
అటు ఘటనపై ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.