కేసీఆర్‌ బాటలో జగన్.. జిల్లాల పర్యటనలకు ఏపీ సీఎం

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తరహాలో జిల్లాల పర్యటనకు సమాయత్తం అవుతున్నారు సీఎం జగన్. దీనిపై ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్… కోవిడ్‌ తగ్గుముఖం పట్టగానే తాను వారానికి రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తానని ప్రకటించారు. కోవిడ్‌ తగ్గుముఖం పట్టగానే ఎమ్మెల్యేలు, అధికారులను కలిపి మండల స్థాయిలో ప్రతి రోజు ఒక గ్రామ, వార్డు సచివాలయాన్ని సందర్శించే కార్యక్రమం మొదలుపెట్టబోతున్నామని వెల్లడించారు జగన్.

కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు రెండు వారాలకు ఒకసారి కలిసి కూర్చోవాలని.. ప్రజల సమస్యలపై చర్చించాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండింటిని ప్రతి వారం సందర్శించాలని.. జాయింట్‌ కలెక్టర్లు వారానికి 4 గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలన్నారు.

మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు వారానికి 4 సచివాలయాలను సందర్శించాలని పేర్కొన్నారు. దీనివల్ల అక్కడ సమస్యలు ఏమున్నాయో తెలుస్తుందన్నారు. వీటి పరిష్కారం విషయంలో ముందగుడు వేయాలని… వివిధ దుకాణాల ద్వారా అమ్ముతున్న విత్తనాలు నాణ్యత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో పరిశీలన చేయాలని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలపై కచ్చితంగా దాడులు జరగాలని.. నకిలీలను అడ్డుకోవడానికి గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.