ఏ జీవికైనా ఏదో ఒక రోజు తప్పనిసరిగా మరణం సంభవిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. జనన మరణాలను ప్రపంచంలో ఎవరూ కూడా అదుపు చేయలేరని చెబుతారు. ఇలా ఎవరికి కూడా చనిపోయే రోజు గురించి తెలియదు. కానీ భవిష్యత్ లో ఇది సాధ్యమే అంటున్నారు శాస్త్రవేత్తలు. మనం ఎప్పుడు చనిపోతామో చెప్పే మిషన్ ను కనిపెట్టినట్లు పేర్కొన్నారు. దీని వల్ల మానవుడు మనస్ఫూర్తిగా జీవించేందుకు అవకాశం ఉంటుందట…
మనం ఎప్పుడు చనిపోతామో తెలిపే పరికరం ఒకటి మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ పరికరం ప్రపంచంలోని దాదాపు సగం మంది ముసలివాళ్ల డేటాను కలిగి ఉంటుందట. దీని సహాయంతో రాబోయే రోజుల్లో మానవులు ఎప్పుడు మరణిస్తారనే విషయం కూడా ముందే తెలుసుకోవచ్చట. ఈ పరికరం మనుషుల సగటు వయసుని బట్టి పని చేస్తుంది. 2013 నుంచే ఈ పరికరాన్ని తయారు చేయడం కోసమని శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. 2013 నుంచి 2017 వరకు దాదాపు ఐదు మిలియన్ల మంది ఈ పరికరం కోసం తమ ఆరోగ్య వివరాలను అందిచగా… ఇది పరిశోధనలు చేసిందని తెలుస్తోంది. ఈ పరిశోధనల ఆధారంగా ఆ మనిషి ఎంతకాలం జీవిస్తాడనే విషయంలో ఓ నిర్ధారణకు వచ్చిందట.
కెనడాలోని ఒట్టావా విశ్వవిద్యాలయ స్టూడెంట్స్ మరియు శాస్త్రవేత్తలు కలిసి ఈ పరికరాన్ని రూపొందించారట. ఈ పరికరం తయారీలో ఐదు మిలియన్ల మంది నుంచి తీసుకున్న ఆరోగ్య వివరాలను క్షుణ్ణంగా పరిశీలించగా… అందులో కొంత మంది త్వరలోనే చనిపోయేలా కనిపించారు. అలా త్వరలోనే చనిపోయేలా ఉన్న వ్యక్తులను గమనించి చూస్తే….వారిలో శారీరక సామర్థ్యం తగ్గడం, అకస్మాత్తుగా శరీరం వాపుకు గురి కావడం, ఆకలి తగ్గడం లాంటి లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవన్నీ మరణం వచ్చే వారిలో కనిపించే సంకేతాలని వారు నిర్ధారణకు వచ్చారు. డాక్టర్ అమీ హసు మాట్లాడుతూ… ఇలా తమ చావు తేదీ ప్రజలకు తెలిస్తే వారు చాలా సంతోషంగా ఉంటారు. చివరి రోజుల్లో తమ కుటుంబాలతో మనసు విప్పి మాట్లాడుతారని పేర్కొన్నారు. ఈ పరిశోధనను జర్నల్ ఆఫ్ ది కెనడియన్ మెడికల్ అసోసియేషన్ లో పొందుపరిచారు.