104కు కాల్‌ చేయండి : వరద బాధితులకు జగన్ సూచనలు

వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఇవాళ సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు సీఎం జగన్. వరద బాధితులు 104 కాల్‌ సెంటర్‌కు కాల్ చేయాలని ఈ సందర్భంగా సూచనలు చేశారు సిఎం జగన్. 104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన వినతులపై వెంటనే రెస్పాండ్‌ కావాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్‌మీద బాగా శ్రద్ధ పెట్టాలని… 104 నంబర్‌ను బాగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు.

ఎవరికైనా ఏదైనా అందకపోయినా, ఏదైనా ఇబ్బంది ఉన్నా 104కు కాల్‌చేస్తే వెంటనే స్పందించాలన్నారు వైఎస్ జగన్. దాదాపు 95 వేల కుటుంబాలు వరదలకు ప్రభావితం అయ్యాయని.., ప్రభుత్వం ఇస్తున్న సహాయం పూర్తిగా వారికి అందాలని పేర్కొన్నారు. సహాయం అందించడంలో ఎక్కడా తప్పులు జరగడానికి వీల్లేదని.. కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు.

తాగునీటి విషయంలో అధికారులు శరవేగంగా చర్యలు తీసుకోవాలని.. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినందున.. తాగునీటి కొరత రాకుండా చూడాలని పేర్కొన్నారు. దీనిపై పటిష్టమైన చర్యలు తీసుకోవాలని.. రానున్న రోజుల్లో కూడా ఇబ్బంది రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని వెల్లడించారు.తాగునీరు, కరెంటుకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని వెల్లడించారు.