కోవిడ్ –19 నివారణ, ఏపీ డిజిటల్ హెల్త్‌పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ కీలక అదశాలు జారీ చేశారు. హెల్త్‌కార్డుల్లో సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ కూడా క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు. పరీక్షలు, వాటి ఫలితాలు, చేయించుకుంటున్న చికిత్సలు, వినియోగిస్తున్న మందులు.. ఇలా ప్రతి వివరాలను ఆ వ్యక్తి డేటాలో భద్రపరచాలన్న సీఎం.. దీనివల్ల వైద్యంకోసం ఎక్కడకు వెళ్లినా ఈ వివరాలు ద్వారా సులభంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
బ్లడ్ గ్రూపు లాంటి వివరాలు కూడా ఇందులో ఉండాలన్న సీఎం జగన్.. 104 ద్వారా వైద్యం అందించే క్రమంలో చేస్తున్న పరీక్షల ఫలితాలకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఈ హెల్త్‌కార్డుల్లో పొందుపర్చాలని వెల్లడించారు. డిజిటిల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా పౌరులందరికీ కూడా హెల్త్‌ఐడీలు క్రియేట్ చేస్తున్నామని అధికారులు సిఎం జగన్ కు తెలియజేశారు.
హెల్త్ హబ్స్‌లో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రుల వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం.. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలకు వైద్యంకోసం వెళ్లాల్సిన అవసరం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. మన రాష్ట్రంలోనే చికిత్స అందించే విధంగా ఉండాలని.. ఏ రకమైన చికిత్సలకు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారో ఆయా ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని వెల్లడించారు. ఆ రకమైన వైద్య సేవలు స్ధానికంగానే ప్రజలకు అందుబాటులోకి రావాలన్న సీఎం.. మనకు కావాల్సిన స్పెషలైజేషన్‌తో కూడిన ఆస్పత్రుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.