ఏపీ హైకోర్టు మొట్టి కాయలు వేయడం తో పార్టీ రంగులు వేయడంపై జగన్ ప్రభుత్వం.. ఓ మెట్టు దిగివచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్టు హైకోర్టు లో ప్రమాణ పత్రం దాఖలు చేసింది జగన్ సర్కార్. భవిష్యత్తు లో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు వేయమంటూ హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు పంచాయతీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల కు పార్టీ రంగులు వేస్తున్నారు అంటూ జై భీమ్ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షులు పరశా సురేష్ కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. తక్షణమే పార్టీ రంగులు తొలగించి ప్రమాణపత్రం దాఖలు చేయాలని గత నెలలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశారు జారీ చేసింది. ఈ నేపథ్యం లోనే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి ఈరోజు హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది జగన్ సర్కార్.