కరోనా పరిస్థితులపై సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో సీఎం జగన్ వీసీ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు వార్నింగ్ ఇచ్చారు. ప్రయివేటు ఆస్పత్రులపై కూడా కలెక్టర్లు దృష్టిపెట్టాలని.. ప్రభుత్వం ప్రకటించిన రేట్ల కన్నా.. ఎక్కువ ఛార్జిలు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఎక్కువ ఛార్జిలు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలా చేసిన ఆస్పత్రులను మూసివేయడానికి కూడా కలెక్టర్లు సంకోచించవద్దని.. మహమ్మారి సమయంలో ప్రజలను పీడించుకు తినే ఆలోచనలు ఉన్నవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
మొదటిసారి ఉల్లంఘిస్తే పెనాల్టీలు వేయాలని.. రెండోసారి చేస్తే క్రిమినల్‌కేసులు చేయాలని వెల్లడించారు. థర్డ్‌వేవ్ వస్తుందో, లేదో మనకు తెలియదని..మనం ప్రిపేర్‌గా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశమన్నారు. వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని.. థర్డ్‌వేవ్‌లో పిల్లలు ప్రభావితం అవుతారని చెప్తున్నారని తెలిపారు. ఈ అంశాలను కలెక్టర్లు దృష్టిలో ఉంచుకోవాలని.. చక్కటి కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించారు. పిల్లలకు చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని.. జిల్లాస్థాయిలో వచ్చే 2 నెలలకు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించారు.