వైఎస్ఆర్ చేయూత పథకంతో ఒక్క అడుగు ముందుకేశామని సీఎం జగన్ అన్నారు. పాత అప్పులకు జమ చేసుకోకుండా ఉండేలా నగదు అందుతుందని తెలిపారు. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ పథకం కింద 45ఏళ్లు దాటిన మహిళలకు ఆర్థికసాయం అందిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమచేయనుందని అన్నారు.
” ఆర్థిక స్వావలంబన లేక మహిళలు పడుతున్న ఇబ్బందులు చూశా. 45-60 ఏళ్ల మహిళలకు ఆర్థిక సహకారం అందించాలనుకున్నా. గతంలో ఈ ప్రకటన చేసినప్పుడు నాపై విమర్శలు చేశారు. ఏటా రూ.18,750 చేయూత పేరిట వారి ఖాతాలకు నగదు జమ అవుతుంది. బ్యాంకులు పాత రుణానికి జమచేసుకోకుండా ఆదేశాలు జారీచేశాం. మహిళలకు ఆర్థిక స్వావలంబన దక్కేలా సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. అముల్, పీఅండ్ జీ, ఐటీసీ, రిలయన్స్ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. వ్యాపార అవకాశాలను మహిళల వద్దకే చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. లబ్ధిదారులకు రూ.18,750తో పాటు 2 పేజీల ప్రభుత్వ లేఖ వస్తుంది. ఒప్పంద సంస్థలతో వ్యాపారానికి మహిళలు నేరుగా సంప్రదించవచ్చు” అని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.