ఇన్నాళ్ళు పాలన మీద దృష్టి పెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు పార్టీ మీద దృష్టి పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో బుధవారం జరిగిన కేబినేట్ సమావేశంలో ఆయన పార్టీ నేతలకు కీలక హెచ్చరికలు చేసారు. మంత్రులకు కూడా ఈ సందర్భంగా కీలక హెచ్చరికలు చేసారు. చిన్న తేడా వచ్చినా మంత్రి పదవులు ఊడటమే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చెయ్యాలని జగన్ స్పష్టమైన హెచ్చరికలు చేసారు.
ఇదే సందర్భంగా ఎమ్మెల్యేలకు కూడా ఆయన కీలక హెచ్చరికలు చేసారు. పని తీరు బాగా లేని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను అని హెచ్చరికలు చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత ఇంఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులదేనని, ఎమ్మెల్యేలు,జిల్లా మంత్రులు ఇంచార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని,
జిల్లాల్లో పార్టీ నాయకత్వం మధ్య ఉన్న గ్రూపు తగాదాలు నేపథ్యంలో సరిదిద్దాలని, మద్యం, డబ్బు పంపిణీ కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఆయన స్పష్టమైన హెచ్చరికలు చేసారు. ప్రభుత్వం, పాలన పనితీరుపై తన దగ్గర సర్వే ఉందని, ఎక్కడైనా ఫలితాల విషయంలో తేడా వస్తే మంత్రులు వెంటనే రాజీనామా చేయాల్సిందేనని, ఈ నెల 8వ తేదీ వరకు పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఎన్నికలకు సన్నద్ధం కావాలనిఆదేశించారు.
ఇన్నాళ్ళు అలసత్వం ప్రదర్శించిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఇప్పుడు అప్రమత్తమవుతున్నారు. జగన్ సంగతి తెలిసిన నేతలు ఒక్కొక్కరు పార్టీ కార్యకర్తలకు ఫోన్ లు చేయడం మొదలుపెట్టారు. మంత్రులు కూడా ఇన్నాళ్ళు చూసి చూడనట్టు వ్యవహరించారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎన్నికల మీద దృష్టి పెట్టి సన్నద్ధం కావాలని ఒక నిర్ణయానికి వచ్చి ప్రజల్లోకి వెళ్ళడానికి రెడీ అయ్యారు.