దాదాపు 13 నెలల రైతు ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని.. చివరకు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని.. ప్రధాని రైతులకు క్షమాపణలు చెప్పారని సీఎం కేసీఆర్ అన్నారు. రైతు వ్యతిరేఖంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉండటం రైతుల దురద్రుష్టం అని సీఎం కేసీఆర్ విమర్శించారు. దిక్కుమాలిన, దరిద్రపుగొట్టు ప్రభుత్వం ఉందని కేసీఆర్ విమర్శించారు. రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులని, ఆందోళన జీవులని కేంద్ర ప్రభుత్వం అవమానించిదని ఆయన అన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించాలని బలమైన కుట్రను కేంద్రం చేస్తుందని… రైతుల భూములను కార్పొరేట్లకు అప్పగించి, ఆ భూములనే రైతులను కూలీలు చేసే కుట్ర చేసిందని ఆరోపించారు. ఉపాధి హామీని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని పలుమార్ల కోరినా కేంద్ర పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. ఎరువులపై ధరలు పెంచారని, భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతుల బావుల వద్ద మీటర్లు పెట్టాలని దిక్కుమాలిన సంస్కరణలు తీసుకువచ్చారని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ విమర్శించారు. మార్కెట్లు లేకుండా చట్టాలు తీసుకువస్తామని చట్టం చేసి వెనక్కి తీసుకెళ్లారని అన్నారు. వ్యవసాయాన్ని కుదేలు చేయాలని, బలహీన పరచాలని కేంద్రం చేసిన కుట్రలో ఇవన్నీ భాగాలే అని సీఎం కేసీఆర్ విమర్శించారు.