ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. సోమవారం రాత్రి దిల్లీ వెళ్లిన ఆయన మూడ్రోజుల పాటు రాజధానిలోనే ఉండనున్నారు. దిల్లీ విమానాశ్రయంలో సీఎం కేసీఆర్కు.. లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు స్వాగతం పలికారు.
రాష్ట్రపతి ఎన్నికలు ముగిసి, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో సీఎం హస్తిన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. తన పర్యటనలో కొత్త రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును సీఎం మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు తెలిసింది.
కేంద్రం వద్ద పెండింగులో ఉన్న పోడుభూముల చట్టసవరణ, తెలంగాణలో గిరిజన, మైనారిటీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం, భద్రాచలం వద్ద తెలంగాణ నుంచి ఏపీలో విలీనం చేసిన అయిదు గ్రామాలను రాష్ట్రానికి తిరిగి ఇప్పించడం తదితర అంశాలను ఆమెకు విన్నవించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి వరదసాయం, విభజన హామీల అమలుపై విజ్ఞాపనలిచ్చేందుకు కేసీఆర్ యోచిస్తున్నారు. అయితే సోమవారం రాత్రి వరకు ఎవరి అపాయింట్‌మెంటూ ఖరారు కాలేదు.
కేంద్రం అప్పుల రూపేణా విధిస్తున్న ఆంక్షలు, పార్లమెంటులో చేసిన ప్రకటనకు సంబంధించి ఆర్థిక నిపుణులతో చర్చించి, కేంద్రాన్ని విమర్శిస్తూ ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మరోవైపు పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఆయన తెరాస ఎంపీలతో భేటీ అవుతారు.