ప్రకాశ్ రాజ్ కలిసి నిన్నటి వేళ మల్లన్న సాగరం చూసి వచ్చాడు పీకే. ఆ విధంగా ఆయన మరోసారి తెలంగాణ వైపు వచ్చాడు.ఆ విధంగా ఆయన తెలంగాణలో ప్రధాన పార్టీలకు తన శక్తినీ యుక్తినీ ఇవ్వనున్నాడు కూడా! ఇప్పటికే ఆంధ్రాలో జగన్ కు, బీహార్ లో నితీశ్ కు,కేంద్రంలో మోడీకి ఎంతో సాయం చేసిన ఈయన తాజాగా తెలంగాణ పొలిటికల్ ఫైర్ పై దృష్టి సారిస్తున్నారు. ఒకేసారి రెండు ప్రధాన పార్టీలకు తన సేవలు అందించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఐ ప్యాక్ సంస్థ బృందాలుగా విడిపోయి ఇప్పటికే కొన్ని పార్టీలకు వేర్వేరుగా సేవలు,సలహాలూ అందిస్తున్నాయి.ఇదే క్రమాన కేసీఆర్ ఆశలన్నీ పీకేపైనే ఉంచుకోవడం అన్నది నిన్నటి వేళ నోచుకున్న విశేషం.
ఎన్నికలు ఎంతో దూరంలో ఉన్నా కూడా ప్రశాంత్ కిశోర్ అనే వ్యూహకర్త మాత్రం రాజకీయ పార్టీలకు దగ్గరగానే ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ కు వ్యూహాలు ఇస్తూనే తన తరఫున కొందరు మనుషులను టీడీపీలోనూ ఉంచాడన్న టాక్ బలీయంగా పైకి నడుస్తోంది. ఆవిధంగా అటు వైసీపీకి ఇటు టీడీపీకి రెండు పార్టీలకూ తన మనుషులే వ్యూహాలు అందించేలా చర్యలు చేపట్టాడు మన బీహారీ పీకే.అంతేకాదు పీకే టీంతో షర్మిల కూడా పనిచేయనున్నారని వార్తలు వస్తున్నాయి.అంటే ఏక కాలంలో మూడు పార్టీలకు ఆయన వ్యూహాలు వెళ్లనున్నాయి.ఓ దశలో కాంగ్రెస్ కు కూడా సేవలు అందించేందుకు ప్రయత్నించినా, గెలిచాక తనకు కేంద్ర మంత్రి పదవి కావాలని పట్టుబట్టారని అందుకే అధిష్టానం ఆయనను వద్దనుకుందని కూడా ఓ వార్త అప్పట్లో హల్చల్ చేసింది.
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఐ ప్యాక్ బృందం సీన్ లోకి వచ్చింది.దీనిని నడిపే ప్రశాంత్ కిశోర్ నిన్నటి వేళ కేసీఆర్ తో భేటీ అయ్యారు.పలు విషయాలపై చర్చించారు.ఈ భేటీతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యూహ కర్తగా ప్రశాంత్ కిశోర్ బృందం వ్యవహరించనుంది అన్నది సుస్పష్టం అయిపోయింది.తాజా పరిణామాల నేపథ్యంలో పీకే రాక దృష్ట్యా ఏం మాట్లాడాలో అన్న దానిపై విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.తెలంగాణలో టీఆర్ఎస్ కథ ముగిసిన ముచ్చట అంటూ ఓ వైపు రేవంత్ ఆగమాగం అవుతుంటే, అదే స్థాయిలో బీజేపీ బాస్ బండి సంజయ్ కూడా నిప్పులు చిమ్ముతున్నాడు.దీంతో ఉత్తరాదికి చెందిన పీకే రాకతో దక్షిణాది రాజకీయాలు ఏ విధంగా పరిణితి చెంది ఉంటాయి. పరిణామ క్రమంలో ఏ విధంగా మారనుంది అన్నది ఇప్పుడు అత్యంత కీలకం కానుంది.
మరోవైపు ఎన్నడూ లేనిది కేసీఆర్ ఈ విధంగా వ్యూహకర్తలపై ఆధారపడడం అన్నది ఓ సంచలనంగానే ఉంది.ఎందుకంటే రాజకీయాల్లో ఆయనను మించిన వ్యూహకర్త లేరు.అయినా కూడా దేశ రాజకీయాల్లో ఎదిగేందుకు పీకేను నమ్ముకుంటున్నారా అన్న వాదన కూడా వినిపిస్తోంది. గుజరాత్ మోడల్ అంటూ ఆ రోజు మోడీ ఏ విధంగా అయితే రచ్చ రచ్చ చేశారో అదే రీతిన తాను కూడా తెలంగాణ మోడల్ పేరిట చేసిన పనులు,చేపట్టిన పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చేలా చేయాలనుకుంటు న్నానని పీకేకు కేసీఆర్ వివరించారు.అంటే ఆ రోజు పీకే వ్యూహకర్తగా ఉన్నప్పుడు బీజేపీ ఏ విధంగా లబ్ధి పొందిందో అదే రీతిన రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ మోడల్ పేరిట కేసీఆర్ తనదైన గొంతుకను దేశ వ్యాప్తంగా వినిపించాలని తహతహలాడుతున్నారు.