కేంద్రంపై గులాబీ దండు యుద్ధం మొదలైంది. మొన్న అసెంబ్లీ సాక్షిగా విద్యుత్ విధానాన్ని తప్పు పట్టి తీవ్రంగా వ్యతిరేకించిన గులాబీ దళపతి కేసీఆర్ తాజాగా మరో అడుగు ముందుకేశారు. కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతికేకించారు. వ్యవసాయంపై కేంద్రం అనుసరిస్తున్న విధానంపై మండిపడ్డారు. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తిలా వుందని దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు.
కేంద్రం తెచ్చిన బిల్లు రైతుల ప్రయోజనాల్ని దెబ్బతీసేదిలా వుందని, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వుదని దుయ్యబట్టారు. కరోనా కారణంగా ఆర్థికంగా సంక్షోభంలో వున్న ఈ సమయంలో కేంద్ర ఎలా ఇలాంటి బిల్లుని ప్రవేశ పెడుతుందని కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ బిల్లుని రాజ్య సభలో తీవ్రంగా వ్యతిరేకించాలని తెరాస ఎంపీలకు దిశ నిర్దేశం చేశారు.
దేశీయంగా వున్న రైతుల ప్రయోజనాల్ని పణంగా పెట్టి మక్కల్ని ఏ ప్రయోజనం కోసం కేంద్రం కొనుగోలు చేస్తోందని కేసీఆర్ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. మక్కల దిగుమతిలో 35 శాతం సుంకం ఎందుఎకు ఎవరి ప్రయోజనాల కోసం తగ్గించారని మండిపడ్డారు. ఈ బిల్లు నేపధ్యంలో ఎన్డీఏ మిత్రపక్షానికి చెందిన నేత కేంద్ర మంత్రి నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. దీంతో ఈ బిల్లుపై దేశ వ్యాప్తంగా వున్న బీజేపీయేతర శక్తులు వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణకు చెందిన అధికార పార్టీ బీజేపీపై ఈ సందర్భంగా యుద్దాన్ని ప్రకటించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొన్న విద్యుత్ బిల్లు .. ఈ రోజు వ్యవసాయ బిల్లుని వ్యతిరేకించడం ఇందుకు అద్దంపడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.