తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఇస్తున్న రైతు బంధు కోసం అన్నదాతల ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడబోతోంది. సీజన్ మొదలైనా పెట్టుబడి సాయం అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు సియం కేసిఆర్ తీపికబురు చెప్పారు. యాసంగి సాగుకు రైతుబంధుపై తుది నిర్ణయం ప్రకటించారు.
లాక్‌డౌన్ ఆ తర్వాత ఏర్పడిన ఇబ్బందుల వల్ల తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా కష్టాల్లో పడింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులు, సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులను ఆపకుండా మంజూరు చేస్తోంది.రెండు నెలల క్రితమే సీజన్ మొదలైనా కరోనా తర్వాత ప్రభుత్వ ఆదాయం పడిపోవడంతో నిధుల మంజూరు ఆలస్యం అయింది. ఆదాయం కాస్త పెరగడం, యాసంగి ఊపందుకోవడంతో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా రైతు బంధు సాయం అందించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం 10 రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది.
2018 ఖరీఫ్ సీజన్ నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదిలో ఒక ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అందిస్తోంది. గత ఖరీఫ్‌లో 57 లక్షల మందికి 7వేల 200 కోట్ల రూపాయలు ఇచ్చారు. కోటి 45 లక్షల ఎకరాలకు ఈ సాయం అందింది. సీజన్ మొదలుకాగానే గత జూలైలో రైతుబంధు డబ్బులు అన్నదాతల ఖాతాలో వేశారు. ఈ సీజన్‌లోనూ ఒకేసారి రైతుల ఖాతాల్లో అమౌంట్ జమ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ సీజన్‌లో 65లక్షల ఎకరాల సాగు లక్ష్యాన్ని పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. భూమి ఉన్న రైతులు సాగు చేసినా చేయకపోయినా.. మొత్తం విస్తీర్ణానికి రైతుబంధు ఇవ్వాలని నిర్ణయించారు.