తెలంగాణ పై బీజేపీ మరింత ఫోకస్..కేంద్రంలో మరిన్ని పదవులు

-

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. దుబ్బాక ఉపఎన్నికల్లో అనూహ్య విజయం ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీ తెలంగాణ పై మరింత ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా దక్షిణ భారతదేశం కీలకం కావడం తెలంగాణలో మరింత బలపడే అవకాశం ఉండటంతో అస్త్రశస్త్రాలకు పదునుపెడుతున్నారు కమలం పార్టీ నేతలు.

ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గం లో రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఒకరు మాత్రమే మంత్రి వర్గంలో ఉన్నారు. అది కూడా సహాయ మంత్రి హోదాలోనే. నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నా, ఆమె తెలుగు రాష్ట్రాల కోట కిందకి రాదనే చెప్పాలి. గతంలో ఎన్డీయే హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి పలువురికి మంత్రి పదవులు దక్కాయి. బీజేపీకి మిత్రపక్షం గా ఉన్న టీడీపీకి కూడా కేంద్రం లో చోటు ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రెండు రాష్ట్రాల్లో బీజేపీకి మిత్ర పక్షాలు లేవు. జనసేన ఉన్నా ఆ పార్టీ కి ఎంపీ లు లేరు..

పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీకి దక్షిణ భారతం కీలకంగా మారింది. నార్త్‌ లో బీజేపీ ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఎంపీ సీట్లు గెలుచుకుంది.. అక్కడ ఇంకా పెరగటం కష్టమనే అభిప్రాయం ఉంది. ఒకవేళ తగ్గినా ఆశ్చర్యం లేదు. కమలం ఇంకా బలపడాలంటే మిగిలింది దక్షిణాది మాత్రమే. దీంతో, దక్షిణ భారతంలో బీజేపీ తమ బలాన్ని పెంచుకొనే ప్రయత్నాలు సీరియస్‌ గా ఉంది. ఈ లెక్కలతోనే బీజేపీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజాగా రెండు ఎన్నికల ఫలితాలతో కొత్త ఉత్సాహం కూడా వచ్చింది. ఇంకొంచెం దూకుడు పెంచితే తెలంగాణ లో అధికారం లోకి రావడం ఖాయమని లెక్కలు వేస్తున్నారు. ఇందుకుగాను తెలుగు రాష్ట్రాలకు మరింత ప్రాముఖ్యం ఇవ్వాలనే ఆలోచన ఆ పార్టీ చేస్తోందని ప్రచారం నడుస్తోంది.

ఇందులో భాగంగా తెలంగాణ నుండి మరొకరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. కిషన్ రెడ్డి శాఖ మార్చి ప్రమోషన్ ఇస్తారని, తెలంగాణ ఎంపీల్లో ఒకరికి అవకాశం ఇస్తారని లేదంటే, కొత్తవారిని రాజ్యసభ కి పంపించి మంత్రి పదవి ఇస్తారనే చర్చ నడుస్తోంది. ఓ దశలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం కూడా సోషల్ మీడియాలో పుష్కలంగా జరుగుతోంది. అయితే పార్టీ అధ్యక్షులుగా ఉన్న వారిని మంత్రి వర్గం లోకి తీసుకోరు. సంజయ్ కి మంత్రి పదవి ఇస్తే ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పు కోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో కమలదళం దూకుడుగా పోతున్న సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేయదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.. అయితే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని రాజ్యసభకి పంపి మంత్రి వర్గంలోకి తీసుకుంటరన్న ప్రచారం కూడా నడుస్తుంది.

మరొక వైపు పార్టీ పదవుల్లో తెలంగాణ బీజేపీ నేతలకు జాతీయ స్థాయిలో మంచి అవకాశమే దక్కింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే , ఓబీసీమోర్చా జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్ కి అవకాశం ఇచ్చిన పార్టీ, డీకే అరుణని కర్ణాటక రాష్ట్ర సహా ఇంచార్జ్ గా, పొంగులేటి సుధాకర్ రెడ్డిని తమిళనాడు సహఇంచార్జి గా, సీనియర్ నేత మురళీధర్ రావు ను మధ్య ప్రదేశ్ ఇంచార్జి గా నియమించింది. ఈ వరుసలోనే మరిన్ని పదవులు తెలంగాణ నేతలకు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news