ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకులు మూలయం సింగ్ యాదవ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం గురుగ్రామ్ లోని వేదాంత ఆసుపత్రిలో ఆయన మృతి చెందారు. ఆయన మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. నేడు యూపీలో జరిగే మూలయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
ఆయనకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలపనున్నారు. మూలయాం సింగ్ యాదవ్ అంత్యక్రియల అనంతరం సీఎం కేసీఆర్ అక్కడి నుండి సాయంత్రం ఢిల్లీ వెళ్ళనున్నారు. ఈ వారాంతం వరకు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. జాతీయ పార్టీ ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి తొలిసారి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ జాతీయ రాజకీయాలపై ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ తో మంత్రి తలసాని, ఎమ్మెల్సీ కవిత, సిఎస్ సోమేశ్ కుమార్ కూడా ఉన్నారు.