ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ కు బయలుదేరారు. ఒక రోజు పర్యటనలో భాగంగా.. కేసీఆర్.. ములుగు రోడ్డులో దామెర క్రాస్ రోడ్డు వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 350 పడకలతో నిర్మించిన ప్రతిమ రిలీఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్యాన్సర్ ఆసుపత్రిని, వైద్య కళాశాలను ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరి సీఎం రోడ్డు మార్గంలో.. వరంగల్‌కు వెళ్తున్నారు. 11.15 గంటలకు ఆసుపత్రిని, వైద్యకళాశాలను ప్రారంభిస్తారు.
ముఖ్యమంత్రి రాకతో వరంగల్ జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. అధునాతన వసతులతో నిర్మించే ఈ ఆసుపత్రి ద్వారా.. వరంగల్ పరిసర ప్రాంతాల వారికి చక్కని వైద్య సేవలందుతాయని తెలిపారు.
పర్యటన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ వాసుల ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారిని కూడా దర్శించుకోనున్నట్లు సమాచారం. కాకతీయ వైద్య కళాశాల ఆవరణలో ఉన్న కాకతీయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం సందర్శించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకల్లా వరంగల్ జిల్లా పర్యటన ముగించుకుని సీఎం..హైదరాబాద్ తిరుగుపయనమవుతారు.