తెలంగాణ ఆడపడుచులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అమలుచేస్తున్న సమర్థ కార్యాచరణ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. స్త్రీశక్తిని చాటేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు.
మహిళా సాధికారతను సంపూర్ణంగా సాధించేందుకు.. మహిళల గౌరవాన్ని మరింత పెంపొందిస్తూ, స్త్రీజనోద్ధరణే లక్ష్యంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తోందని వివరించారు. 9 ఏళ్ల పాలనలో మహిళాభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రం మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతోందని కేసీఆర్ గుర్తు చేశారు.
మరోవైపు ఇవాళ.. రాష్ట్ర మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేసి.. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 27 మంది నారీమణులను మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి, సత్యవతి సన్మానించనున్నారు. విశిష్ట మహిళా పురస్కారం కింద లక్ష రూూపాయల నగదు, జ్ఞాపికలు అందించనున్నారు.