మూడు రోజుల క్రితం కరోనా బారిన పడ్డ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్… తాజాగా కోలుకున్నారు. కోవిడ్ కారణంగా 2 రోజులు జ్వరం వచ్చి, 7-8 రోజులు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న తర్వాత, తాను పూర్తిగా కోలుకున్నానని స్వయంగా సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు. ఢిల్లీలో కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇవాళ సీఎం కేజ్రీవాల్ ప్రకటన చేశారు.
ఇక ఇవాళ ఢిల్లీ లో ఏకంగా 22 వేల కరోనా కేసులు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో… ఢిల్లీ ప్రజలెవరూ అస్సలు భయపడవద్దని కోరారు. కరోనా రెండో దశ కంటే.. థర్డ్ వేవ్ లో మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కాబట్టి ప్రజలెవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా కట్టడికి తాము అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే.. ఢిల్లీ లో లాక్ డౌన్ విధించాలనే ఆలోచన తమకు అస్సలు లేదని స్పష్టం చేశారు.