మణిపూర్‌లో హింస కొనసాగుతోంది. గత రెండున్నర నెలలుగా రాష్ట్రంలో రావణకాష్టంలా హింసాయుత ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో జరుగుతున్న అమానవీయ సంఘటనలు ఇప్పుడు ఒక్కొ్క్కటిగా బయటికొస్తున్నాయి. అయితే మణిపూర్‌లోని ప్రజలకు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు సంఘీభావం తెలపడమే కాకుండా తమ వంతు సహకారాలను అందిస్తున్నాయి.
ఎక్కడ చూసినా అల్లర్లు, గొడవలు జరుగుతుండడంతో ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి ప్రభుత్వం కూడా ఆటగాళ్లను పట్టించుకోవడం లేదు. ఈక్రమంలో మణిపూర్ ఆటగాళ్లకు తమిళనాడు సీఎం స్టాలిన్ అండగా నిలిచారు. క్రీడాకారులు ప్రాక్టీస్ చేసేందుకు మణిపూర్‌లో సరైన పరిస్థితులు లేవని సీఎం స్టాలిన్ వెల్లడించారు. ఈ మేరకు మణిపూర్ క్రీడాకారులు తమిళనాడుకు రావాలని.. వారికి కావాల్సిన శిక్షణ తాము ఇస్తామని తెలిపారు. తమిళనాడు క్రీడాభివృద్ధిశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి కోచ్‌ల పర్యవేక్షణలో క్రీడాకారులకు శిక్షణ అందిస్తామని స్టాలిన్ పేర్కొన్నారు.