ముఖ్యమంత్రి సీఎం జగన్ దావోస్ పర్యటన పై టిడిపి చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ముఖ్యమంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం టీడీపీకి, ఎల్లో మీడియాకు ఒక అలవాటుగా మారింది అని మండిపడ్డారు. రోజురోజుకు వారిలో అనాగరికత పెరిగిపోతోంది అన్నారు. కనీస విలువలు పాటించాలన్న స్పృహ కోల్పోయి ఉన్మాదుల ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సీఎం దావోస్ పర్యటన మీద యనమల చేసిన ఆరోపణలు నిస్సిగ్గుగా ఉన్నాయి అన్నారు.
వయసు మీదపడుతున్న కొద్దీ యనమల కనీస సంస్కారం లేకుండా దిగజారి పోతున్నాడన్నారు బుగ్గన. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారికి కూడా విమాన ప్రయాణాల్లో అంతర్జాతీయ నియమాలు, నిబంధనల మీద అవగాహన లేకపోవడం విచారకరమన్నారు. సీఎం పర్యటన రహస్యం ఏమీ కాదని.. కుటుంబ సభ్యులతో కలిసి దావోస్ చేరుకుంటారు అన్న దాంట్లో ఎలాంటి రహస్యం లేదన్నారు. నిన్న గన్నవరం విమానాశ్రయంలో బయలుదేరిన తర్వాత సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్లో ఆగింది అన్నారు. ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఆలస్యం జరిగింది అని తెలియజేశారు.
దీనివల్ల లండన్ ఎయిర్పోర్టుకు చేరుకున్నప్పుడు ఆలస్యం అయింది అన్నారు. లండన్ లో కూడా ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా ఉందని, ఈలోగా జురేక్ లో ల్యాండ్ అవడానికి ప్రయాణం షెడ్యూల్ సమయం రాత్రి పది గంటలు దాటి పోయింది, మళ్లీ ల్యాండింగ్ కోసం అధికారులు రిక్వెస్ట్ పెట్టారని తెలియజేశారు. ఈ ప్రక్రియలో స్విట్జర్లాండ్ లోని భారత ఎంబసీ అధికారులు కూడా పాల్గొన్నారని వివరణ ఇచ్చారు.