రాబందుల రాజ్యంగా ఆప్ఘనిస్తాన్.. మరిన్ని ఆంక్షలు విధించిన తాలిబన్లు

-

అశ్రఫ్ ఘనీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబన్లు తమ చేతుల్లోకి పాలనా వ్యవస్థను తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆ దేశం నుంచి సైనిక బలగాలను అగ్రరాజ్యం అమెరికా వెనక్కు తీసుకున్నది. ఇక ఆ దేశంలో తాలిబన్లు ఏది చేసినా చెల్లే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అయితే, తాలిబన్ల రాజ్యం మొదలైన తర్వాత ఆప్ఘనిస్తాన్‌లో రూల్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా భిన్నంగా వ్యవహరిస్తామని చెప్తూనే తాలిబన్లు ఆచరణలో ఇంకా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతూ అణచి వేస్తున్నారు. మహిళలకు విద్యాబోధన విషయంలోనూ తాలిబన్ల నిర్ణయం యువతుల పాలిట శాపంగా మారేలా ఉంది. ఈ విషయమై ఆ దేశ విద్యావేత్తలు, సోషల్ వర్కర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌లో కో-ఎడ్యుకేషన్ విధానం నిషేధించారు. ఫలితంగా అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదువుకునే పరిస్థితులు ఇక ఉండబోవు.

ఇక షరియా చట్టం ప్రకారం ఇప్పుడు ఆడపిల్లలకు చదువు చెప్పడానికి పురుషులను అనుమతించబోరు. మొత్తంగా ఆప్ఘన్ దేశంలో అన్ని పనులు షరియా చట్టం ప్రకారం జరుగుతాయని తేల్చి చెప్పారు. మొత్తంగా ఆప్ఘనిస్తాన్ దేశంలో ఇంకా క్రూరాతి క్రూరమైన పరిస్థితులు నెలకొని ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దేశం విడిచి చాలా మంది అనగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఇతరులు వెళ్లిపోయారు. తమ దేశంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే ఆప్ఘన్ దేశ తొలి మహిళా ఎంపీ ఆ దేశాన్ని విడిచిపెట్టినందుకుగాను భావోద్వేగానికి గురైంది. తమ దేశంలో ఇలాంటి పరిస్థితి వచ్చి, తాను కనీసం పిడికెడు మట్టిని తన వెంట తీసుకొచ్చే పరిస్థితి లేకపోవడం బాధాకరమని పేర్కొంది. ఆప్ఘనిస్తాన్ దేశం తాలిబన్ల వశమైన నాటి నుంచి మహిళల హక్కులు ప్రశ్నార్థకం కాగా, ఇప్పుడు హక్కుల ఊసెత్తే పరిస్థితులే లేవు.

Read more RELATED
Recommended to you

Latest news