సినిమాల్లో కమెడియన్‌గా తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్న వేణుమాధవ్… రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్‌లో బిజీ స్టార్‌గా ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నటించి టాప్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఇటు రాజకీయాల్లో కూడా సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేశాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో పనిచేసిన వేణుమాధవ్ ఆ పార్టీ తరపున పలు ఎన్నికల్లో ప్రచారం కూడా చేశాడు.
2017లో ఏపీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం పనిచేశారు. ఇదిలా ఉంటే వేణుమాధవ్‌కు రాజకీయాల్లో రాణించాలన్న కోరిక బలంగా ఉండేది. ఈ విషయాన్ని ఆయన కూడా పలు సందర్భాల్లో తెలిపారు. సినిమాల్లోకి రావడానికి ముందు నుంచే వేణుమాధవ్‌కు టీడీపీతో సాన్నిహిత్యం ఉంది.
ఇక వేణుమాధవ్ సొంత ఊరు సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలంలో ఉంది. అందుకే వేణు కోదాడ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు. 2014 ఎన్నికల్లో సీటు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యాడు. ఇక గత డిసెంబర్లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా అప్పటికే ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత క్రమంగా రాజకీయాలకు, టీడీపీకి కూడా దూరంగా ఉన్నారు. చివరకు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే కావాలని అనుకున్న తన కోరిక తీరకుండానే కన్నుమూశారు.