దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం జనవరి 16వ తేదీ నుంచి కొనసాగుతోంది. మే 1 నుంచి 18-44 ఏళ్ల వయస్సు వారికి టీకాలను వేయాలని నిర్ణయించారు. కానీ అనేక రాష్ట్రాల్లో టీకాల కొరత కారణంగా వారికి వ్యాక్సిన్లను ఇవ్వడం లేదు. అయితే కోవిడ్ వ్యాక్సిన్లను తీసుకునే వారు చాలా మందిలో అపోహలు నెలకొంటున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. కోవిడ్ టీకా తీసుకున్న తరువాత మద్యం సేవించవచ్చా ?
కోవిడ్ టీకా తీసుకున్న వారు మద్యం సేవించకూడదని ఎక్కడా చెప్పలేదు. కానీ టీకా తీసుకున్న తరువాత 2 వారాలు ఆగితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అప్పటి వరకు శరీరంలో యాంటీ బాడీలు ఉత్పన్నమవుతాయని, అవి ఇన్‌ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటాయని అంటున్నారు. అందువల్ల టీకా తీసుకున్న వారు కొద్ది రోజుల పాటు మద్యం మానేయడం మంచిది.
2. కోవిడ్ టీకా తీసుకున్న తరువాత శృంగారంలో పాల్గొనవచ్చా ?
కోవిడ్ టీకాలకు శృంగారానికి సంబంధం లేదు. కోవిడ్ టీకా తీసుకున్నా నిర్భయంగా శృంగారంలో పాల్గొనవచ్చు.
3. కోవిడ్ టీకాలను తీసుకున్న వారు రక్తదానం చేయవచ్చా ?
కోవిడ్ టీకాలను తీసుకున్న వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోతే, వారు ఆరోగ్యంగా ఉంటే వారు రక్త దానం చేయలేదు. ఇందులో వెనుదీయాల్సిన పనిలేదు.
4. గర్భిణీలు టీకాలను తీసుకోవచ్చా ?
గర్భిణీలు కోవిడ్ టీకాలను తీసుకోవచ్చు. అయితే గర్భం అప్పుడే ధరించిన వారు టీకాలను తీసుకునేందుకు 12 వారాలు ఆగితే మంచిది.
5. రుతు సమయంలో స్త్రీలు కోవిడ్ టీకాలను తీసుకోవచ్చా ?
అవును. తీసుకోవచ్చు. రుతు సమయంలో టీకాలను తీసుకోకూడదు అనేది అపోహ మాత్రమే. నిర్భయంగా ఆ సమయంలో వ్యాక్సిన్లను వేయించుకోవచ్చు.
6. కోవిడ్ టీకా తీసుకుంటే సంతాన లోపం సమస్యలు వస్తాయా ? మహిళలకు అబార్షన్ అవుతుందా ?
కాదు. ఇందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవు. కనుక నిర్భయంగా టీకాను తీసుకోవచ్చు.
7. కోవిడ్ టీకాలను తీసుకుంటే హార్ట్ ఎటాక్‌లు వస్తాయా ?
కోవిడ్ టీకాలను తీసుకున్న తరువాత కొందరు హార్ట్ ఎటాక్ లు వచ్చి చనిపోయారు. నిజమే. కానీ కోవిడ్ టీకాలకు, హార్ట్ ఎటాక్‌లకు సంబంధం లేదని నిపుణులు తేల్చారు. కనుక నిర్భయంగా టీకాలను తీసుకోవచ్చు.