తెలంగాణలో త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను వాయిదా కాంగ్రెస్, తెలంగాణ జన సమితి పార్టీలు కోరాయి. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నేతలు, అలానే తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి వేర్వేరుగా లేఖలు రాశారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని వారు ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్ళారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. హైకోర్టు సూచనలను పరిగణలోకి తీసుకుని ఈ ఎన్నికలు వాయిదా వేయాలని కోదండరాం తన లేఖలో కోరారు.
కాగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను నిలిపివేయాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ హై కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయగా.. ఎన్నికల ప్రక్రియ మొదలైన కారణంగా తాము ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని హై కోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. కాగా తాజాగా కాంగ్రెస్, తెలంగాణ జన సమితిలు ఇదే విషయాన్ని మరోసారి ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్ళారు. కాగా తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలోఎస్‌ఈసీ ఎన్నికల ప్రచార సమయాన్ని కుదించింది. రాత్రి 8 గంటల్లోపు ప్రచారం ముగించాలని అభ్యర్థులకు సూచించింది.
తెలంగాణలో ఖమ్మం, వరంగల్ నగర పాలక సంస్థలతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి ఏప్రిల్ 18 రోజే నామినేషన్లు స్వీకరణ,19న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కూడా ముగిసింది. ఏప్రిల్ 22 వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. ఇక ఏప్రిల్ 30న పోలింగ్, మే 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి